తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు అమెరికాకు వెళ్లనున్నారు. నేటి నుంచి దాదాపు 10 రోజుల పాటు అమెరికాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా కు వెళ్తున్నారు. ఈ నెల 29 వరకు సాగే అమెరికా పర్యటనలో ముఖ్యంగా తూర్పు, పశ్చిమ కోస్తా ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటిస్తారు. కాగ ఈ పర్యటనలో కేటీఆర్ వెంట.. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తో పాటు లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగరప్పన్, ఎలక్ట్రానికస్ సుజయ్ కారంపూరితో పాటు పలువురు ఉన్నారు.
కాగ మంత్రి కేటీఆర్ పర్యటన లాస్ ఎంజిలెస్ లో ప్రారంభం అవుతుంది. ఈ నెల 20 న శాండియాగో, 21వ తేదీన శాన్ జోస్, 24 వ తేదీన బోస్టన్, 25 వ తేదీన న్యూయార్క్ లో మంత్రి కేటీఆర్ పర్యటన సాగుతుంది. ఈ పర్యటనలో ఆయా నగరాల్లో ఉన్న ప్రముఖ కంపెనీల అధిపతులతో పాటు సీఈవో లను మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉందని ఆయా కంపెనీలతో తెలపనున్నారు. అలాగే తమ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సైతం ఆయా కంపెనీల అధిపతులతో చర్చించనున్నారు. కాగ ఈ రోజు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేటీఆర్ బృందం బయలు దేరుతుంది. తిరిగి ఈ నెల 29 వ తేదీన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అవుతారు.