వికారాబాద్ లో కల్తీ కల్లు ఘటన ఎంత టెన్షన్ పెట్టిందో అందరికీ తెలిసిందే. కల్తీ కల్లు తాగడంతో వందల మంది ఆసుపత్రి పాలయితే ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇంకా పలువురి పరిస్థితి విషమంగానే ఉంది. ఈ కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలోని దాదాపు అన్ని కల్లు డిపోలను ఎక్సైజ్ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా మూయించారు. ఇప్పుడు అదే కొందరి ప్రాణాల మీదకు తెస్తుంది.
చాలా సంవత్సరాలుగా కల్లుకి బానిసైన గ్రామస్తులు కొంత మంది కల్లు దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కల్తీ కల్లు ఘటన మరువక ముందే ఓ వ్యక్తి గ్రామంలో హల్చల్ చేశాడు. తనకు తాగేందుకు కల్లు కావాలంటూ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి తలుపు కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీధి వీధి తిరుగుతూ తన కల్లు కావాలంటూ ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. అతను వికారాబాద్ ఆసుపత్రి నుంచి రెండు రోజుల క్రితమే డిస్చార్జ్ అయినట్లు సమాచారం. వికారాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.