లుంగి కట్టుకుంటే ఏయే లాభాలుంటాయే సరిలేరునీకెవ్వరులో మహేశ్ చెప్పాడు. హీరో లుంగీ కడితే బాక్సాఫీస్ కూడా ఖుషీ అయిపోతుంది. మాస్ ఇమేజ్ కావాలంటే.. లుంగీ కట్టాల్సిందే. ఈ విషయం సీనియర్స్‌కు బాగా తెలుసు. ఇప్పటి టాపర్స్ కూడా.. లుంగీ కట్టుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓ యంగ్ హీరో బర్త్‌డే సందర్భంగా లుంగీతో వున్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
మాస్ ఇమేజ్ కావాలంటే.. యాక్షన్ మూవీ చేయాల్సిందే. బెజవాడ.. సవ్యసాచి వంటి యాక్షన్ మూవీస్‌తో మాస్ ఇమేజ్ కోసం నాగచైతన్య ట్రై చేసినా.. అది మాత్రం దక్కలేదు. దీంతో మరోసారి తనకు కలిసొచ్చిన ‘లవ్‌స్టోరీ’నే ఎంచుకున్నాడు. పేరుకు లవ్‌స్టోరీనే గానీ మాస్‌ను ఆకట్టుకునే విషయాలు ఇందులో వున్నాయని.. రీసెంట్ లుంగీ పోస్టర్ తెలియజేసింది. శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లవ్‌స్టోరీ షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్‌కు రెడీగా వుంది.
నాగచైతన్యకు ఇంకా మాస్ ఇమేజ్ రాకపోయినా.. నాగార్జునకు చాలా లేటుగా వచ్చింది. ఈ టాలీవుడ్ మన్మథుడు లుంగీతో కనిపించిన సీన్స్.. సాంగ్స్ తక్కువే అయినా.. అల్లరి అల్లుడులోని లుంగీ సాంగ్ మాస్‌లోకి దూసుకెళ్లింది. సినిమాలో ఆరుపాటలుంటే.. లుంగీ సాంగ్ ప్రేక్షకులను గట్టిగా టచ్ చేస్తుంది. సినిమాలో ఆ పాటే హైలైట్ అవుతుంది. దీనికి ఉదాహరణ ఘరానామొగుడు సినిమాలో ఏందిబే ఎట్టాగ వుంది ఒళ్లు సాంగ్. చిరంజీవి కట్టిన ఈ లుంగీకి ఎంత క్రేజ్ వచ్చిందంటే.. అప్పట్లో ఘరానా మొగుడు లుంగీ అంటూ మార్కెట్‌లో అమ్మితే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
ఇప్పటి స్టార్స్‌లో లుంగీ ఎక్కువసార్లు కట్టింది మహేశే. సూపర్‌స్టార్ లుంగీ కడిడితే సినిమా హిట్టేనని ఫీల్ అవుతారు అభిమానులు. పోకిరి నుంచి సరిలేరు నీకెవ్వురు వరకు అన్నీ లుంగీ సినిమాలు హిట్ కావడంతో.. ఫ్యాన్స్‌లో ఈ సెంటిమెంట్ బలపడిపోయింది. పోకిరి సినిమాలో ‘చూడొద్దంటున్నా.. చూస్తూనే వుంటా..’ సాంగ్‌లో మహేశ్‌కు లుంగీతో అనుబంధం మొదలైంది. ఆతర్వాత శ్రీమంతుడులోని ‘జాగో..’ సాంగ్ మధ్యలో లుంగీతో ఎంట్రీ ఇస్తాడు. ఇక సరిలేరునీకెవ్వరులో మైండ్ బ్లాక్ అంటూ.. ఔట్ అండ్ ఔట్ సాంగ్ మొత్తం లుంగీతో కనిపించి.. బాక్సాఫీస్ మైండ్‌ను బ్లాక్ చేశాడు సూపర్‌స్టార్ .
కొన్ని లక్షలు పెట్టి ష్యాషన్ డిజైనర్‌తో కాస్ట్యూమ్ చేయించినా రాని పేరు లుంగీతో కొట్టేయొచ్చు. ఈ సింపుల్ కాస్యూమ్ కావాల్సినంత మాస్ ఇమేజ్ తీసుకొస్తుంది. దువ్వాడ జగన్నాథమ్‌లో మెచ్చుకో సాంగ్‌లో బన్నీ లుంగీతో ఇంప్రెస్ చేశాడు. మహేశ్.. బన్నీ.. ఒకటీ అర పాటల్లోనే లుంగీ కడితే.. రామ్‌చరణ్ రంగస్థలం మొత్తం లుంగీతోనే కనిపించి బొమ్మను బ్లాక్‌బస్టర్ చేశాడు. సినిమాలో ఎన్ని హిట్ పాటలున్నా.. లుంగీ సాంగ్ వుంటే చాలు. అది అన్ని సాంగ్స్‌ను మించి హిట్ అవుతుంది. సింహాద్రిలో తారక్ నిక్కర్‌పై లుంగీ కట్టి ‘నే విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి’ అని పాడితే థియేటర్స్ ఊగిపోయాయి.
ఎఫ్2లో వెంకటేశ్, వరుణ్‌తేజ్ చిందేసిన పాట కూడా బాక్సాఫీస్‌ను గిరా గిరా తిప్పింది. ఈమధ్యకాలంలో లుంగీ సాంగ్స్‌పై మన దర్శకులు ఫోకస్ పెట్టారు. సందర్భం కలిస్తే.. లుంగీపాటను పెట్టేస్తున్నారు. లవ్‌స్టోరీలో లుంగీ కట్టుకుని ఫోజిచ్చిన బర్త్‌డేబాయ్ ఎలా సందడి చేస్తాడో చూడాలి.