కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్‌

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో బుధవారం (01-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

top 10 covid 19 updates on 1st july 2020

1. కరోనా టెస్టుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు మరోమారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత 20 రోజులుగా ఎన్ని టెస్టులు చేశారో చెప్పాలని, జూలై 17 లోగా కోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

2. ఏపీలో గడిచిన 24 గంటల్లో 657 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,252కు చేరుకుంది. మొత్తం 193 మంది చనిపోయారు. 6,998 మంది రికవరీ అయ్యారు. 8,071 మంది చికిత్స పొందుతున్నారు.

3. పాట్నాలో ఓ పెళ్లికి 350 మంది హాజరు కాగా వారిలో పెళ్లి కుమారుడితోపాటు 110 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్దారించారు. కాగా పెళ్లి కుమారుడికి తీవ్ర అస్వస్థత కలగడంతో అతను కరోనా కారణంగా పెళ్లయిన రెండో రోజే మృతి చెందాడు. బీహార్‌లో ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.

4. డాక్టర్స్‌ డే సందర్భంగా ప్రధాని మోదీ వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనాపై వైద్యులు, వైద్య సిబ్బంది చేస్తున్న పోరాటాన్ని మరువలేమని అన్నారు. కరోనాపై పోరులో వైద్యులు ముందంజలో ఉన్నారని అన్నారు.

5. పతంజలి ఆయుర్వేద సంస్థ తయారు చేసిన కరోనైల్‌కు ఎట్టకేలకు లైన్‌ క్లియర్‌ అయింది. బుధవారం నుంచి ఈ ఔషధ విక్రయాలను ప్రారంభించారు. దీనికి ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు లభించాయని యోగా గురువు బాబా రాందేవ్‌ తెలిపారు.

6. అమెరికాలో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలోనే అక్కడ కొత్తగా 47వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,31,736కు చేరుకుంది. మొత్తం 1,30,174 మంది చనిపోయారు.

7. తెలంగాణలో కరోనా పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఎంపీ రేవంత్‌ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

8. కోవిడ్‌ చికిత్సలో భాగంగా ఎమర్జెన్సీ పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడుతున్న రెమ్‌డెసివిర్‌ అనే మందుపై ట్రంప్‌ సర్కారు కుట్ర పన్నింది. అక్కడి గిలియాడ్‌ సైన్సెస్‌ ఈ మందును ఉత్పత్తి చేస్తుంది. ఈ క్రమంలో దీన్ని ఇతర దేశాలకు 3 నెలల పాటు దక్కకుండా ట్రంప్‌ కొత్త ఎత్తు వేశారు. ఈ మందు ఎగుమతులపై నిషేధం విధించనున్నట్లు తెలిసింది.

9. జూలై 2వ తేదీ నుంచి గోవా ప్రభుత్వం దేశీయ పర్యాటకులకు తమ రాష్ట్రంలోకి ప్రవేశానికి అనుమతులు ఇస్తున్నట్లు తెలిపింది. అక్కడి 250 టూరిస్టు హోటళ్లకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. పర్యాటకంపైనే ఆధారపడ్డ గోవాకు మార్చి 25వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం పెద్దగా రావడం లేదు.

10. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతుండడంతో నగరంలో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తే ఎలా ఉంటుందనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. కొందరు మంత్రులు లాక్‌డౌన్‌ వద్దంటున్నట్లు తెలిసింది. దీనిపై సీఎం కేసీఆర్‌ ఇంకా ఒక నిర్ణయానికి రానట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news