కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక రంగాలు నష్టపోయాయి. వాటిల్లో ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగం కూడా ఒకటి. ఈ క్రమంలోనే అనేక కంపెనీలు ఇటీవల లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. దీంతో ఐటీ రంగం అనేక మంది ఉద్యోగాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా మళ్లీ తమకు ఉద్యోగాలు వస్తాయా..? అని ఇప్పటి వరకు వారు భయపడ్డారు. కానీ ఐటీ కంపెనీలు మాత్రం గుడ్ న్యూస్ చెప్పాయి. త్వరలోనే 1 లక్ష ఉద్యోగాలను ఇవ్వనున్నట్లు తెలిపాయి.
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నవారు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. చాలా తక్కువ సంఖ్యలో ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు వెళ్తున్నారు. అయితే కరోనా ఆంక్షలను ప్రస్తుతం సడలిస్తుండడంతో మళ్లీ కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. దీంతో ఐటీ కంపెనీలకు మళ్లీ ప్రాజెక్టులు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే ఆయా కంపెనీలు తిరిగి ఉద్యోగులను తీసుకునేందుకు రెడీ అవుతున్నాయి. అందులో భాగంగానే ప్రధాన ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ తదితర సంస్థలు త్వరలో 1 లక్ష వరకు ఉద్యోగులను విధుల్లోకి తీసుకోనున్నట్లు ప్రకటించాయి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) త్వరలో కొత్తగా 40వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అలాగే ఇన్ఫోసిస్ కొత్తగా 20వేల మందిని తీసుకోనుంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 15వేల మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు ప్రకటించింది. కాంగ్నిజెంట్ కూడా 15వేల మందిని కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని తెలిపింది. ఈ క్రమంలో పలు ఇతర కంపెనీలు కూడా కొత్త ఉద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లను త్వరలో ప్రకటించనున్నాయి. కరోనా వల్ల ఇన్ని రోజులూ ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడ్డ ఐటీ ఉద్యోగులకు త్వరలో మంచి రోజులు వస్తున్నాయనే చెప్పవచ్చు.