ఏపీలో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. తుఫాన్ ప్రభావం వలన విజయవాడ, గుంటూరు జిల్లాల్లో భారీగా ఆస్తి, పంట నష్టం సంభవించినట్లు సమాచారం. పశుసంపద కూడా భారీగానే దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వరదల ధాటికి పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తాజాగా విజయవాడలో వచ్చిన వరదలు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. భారీవర్షాల కారణంగా బుడమేరు ఉధృతంగా ప్రవహించడంతో అందులో తండ్రీకొడుకులు ఇద్దరు కొట్టుకుపోయారు.
తాజాగా వీరిద్దరి మృతదేహాలను పోలీసులు కనిపెట్టారు. బెజవాడలోని గుణదలకు చెందిన వేంకటేశ్వర రావు (60), ఆయన కుమారుడు సందీప్ (35) బుడమేరు వాగు ప్రవాహం వెళ్లిన దారిలో డైరీ ఫాం నడుపుతున్నారు. ఆదావారం సాయంత్రం డైరీ ఫామ్‌లో తండ్రీ కొడుకులు ఉండగా బుడమేరు వరద ఉధృతి ఒక్కసారిగా వచ్చింది. దీంతో వీరిద్దరూ ఒకేసారి వరదలో గల్లంతయ్యారు. ఒక రోజు తర్వాత ఇద్దరి మృతదేహాలు పోలీసులు గుర్తించారు. అయితే, సందీప్ మొన్నటివరకు సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరిని కోల్పోవడంతో బాధిత కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.