పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఒక బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో ఏకంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. లోయ ఎక్కువ లోతులో ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అక్కడి అధికారులు చెప్పారు. పాకిస్థాన్‌లోని స్థానిక కథనాల ప్రకారం.. బలూచిస్థాన్‌లో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
54 మంది ప్రయాణికులతో బస్సు దక్షిణ బలూచిస్తాన్‌లోని టర్బాట్ నగరం నుంచి ఉత్తరాన 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని క్వెట్టాకు బయల్దేరింది. ఈ క్రమంలోనే కొండ ప్రాంతంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కొండ ప్రాంతంలో మలుపు వద్ద బస్సు అదుపుతప్పింది. దాంతో.. డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. రోడ్డు పక్కకే ఉన్న లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో డ్రైవర్ సహా మొత్తం 28 మంది స్పాట్‌లోనే చనిపోయారు. సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.