టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వొడాఫోన్ ఐడియా తన పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు రెడ్ఎక్స్ పేరిట ప్రత్యేక పోస్ట్ పెయిడ్ ప్లాన్ ద్వారా ప్రీమియం సేవలను అందిస్తున్న విషయం విదితమే. అయితే కేవలం కొందరు వినియోగదారులకు లాభం చేకూర్చేలా వొడాఫోన్ ఐడియా వ్యవహరిస్తుందని, ఇందులో పారదర్శకత లోపించిందని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థ ఆ ప్లాన్‌ను అందిస్తుందని ట్రాయ్ తెలిపింది. అందుకనే ఈ విషయంపై ట్రాయ్ వొడాఫోన్ ఐడియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఆగస్టు 31వ తేదీ లోగా వొడాఫోన్ ఐడియా తాను అందిస్తున్న రెడ్ ఎక్స్ ప్లాన్‌పై షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలని ట్రాయ్ ఆదేశించింది. అయితే మరోవైపు ఎయిర్‌టెల్ కూడా ప్లాటినం ప్లాన్లతో తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ప్రీమియం సేవలను అందిస్తోంది. కానీ ట్రాయ్ గతంలో ఇదే విషయంపై ఎయిర్‌టెల్‌ను ప్రశ్నించగా.. ఎయిర్‌టెల్ ఆ ప్లాన్లకు మార్పులు, చేర్పులు చేసింది. దీంతో ట్రాయ్ కేవలం వొడాఫోన్ ఐడియాకు మాత్రమే షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
కాగా వొడాఫోన్ ఐడియా అందిస్తున్న రెడ్ ఎక్స్ ప్లాన్ ను తీసుకున్న వారికి ఇతర వొడాఫోన్ ఐడియా కస్టమర్ల కన్నా వేగవంతమైన నెట్ స్పీడ్, ప్రియారిటీ కస్టమర్ కేర్ తదితర సేవలు లభిస్తాయి. ఎయిర్ టెల్‌లో ప్లాటినం ప్లాన్లను వాడుతున్న వారికి కూడా సరిగ్గా ఇలాంటి లాభాలే కలుగుతాయి. కానీ ట్రాయ్ ఇదే విషయంపై ప్రశ్నించాక ఎయిర్ టెల్ వెనక్కి తగ్గింది. కానీ వొడాఫోన్ ఐడియా దీనిపై ట్రాయ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. పెద్ద మొత్తంలో నెల నెలా చెల్లించే వారికి ప్రీమియం సేవలను అందిస్తే తప్పేమిటని వొడాఫోన్ ఐడియా ప్రశ్నిస్తోంది. అయితే కేవలం కొందరు కస్టమర్లకే లాభం చేకూర్చేలా వ్యవహరించడం సరికాదని ట్రాయ్ భావిస్తోంది. అందుకనే ఈ వివాదం నెలకొంది.