టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు షాక్ ఇచ్చింది. ఎయిర్‌టెల్ తన ప్లాటినం పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు, వొడాఫోన్ తన రెడ్ఎక్స్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ఇతర కస్టమర్ల కన్నా అధిక ఇంటర్నెట్ స్పీడ్‌తో మొబైల్ డేటాను అందిస్తున్న విషయం విదితమే. అలాగే ఆయా కస్టమర్లకు ప్రత్యేక సర్వీసులను కూడా ఆయా టెలికాం కంపెనీలు అందిస్తున్నాయి. ఇతర కస్టమర్లకు కాకుండా.. కేవలం ప్రీమియం పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను వాడుతున్న వారికే ఇలా ఆయా సంస్థలు సేవలను అందించడం పట్ల ట్రాయ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఆయా ప్లాన్లను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
టెలికాం సేవలను కస్టమర్లు అందరికీ ఒకేలా అందించాలని.. అలాంటప్పుడు డబ్బు పెట్టి ప్రీమియం ప్లాన్లను వాడుతున్న ధనిక కస్టమర్లకు సేవలు ఒకలా, ఇతర పేద కస్టమర్లకు ఒకలా.. సేవలు అందించడం ఎంత వరకు సమంజసమని ట్రాయ్ ఆయా టెలికాం సంస్థలను ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ట్రాయ్ ఆదేశించింది. ప్రీమియం ప్లాన్లను వాడే కేవలం కొందరు పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకే అధిక ఇంటర్నెట్ స్పీడ్‌తో మొబైల్ డేటాను అందిస్తే ఇతర కస్టమర్ల పరిస్థితి ఏమిటని, వారు కస్టమర్లు కాదా అని ట్రాయ్ ప్రశ్నించింది. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉండాలన్నదే తమ అభిమతమని, అది కేవలం కొందరు ధనిక కస్టమర్లకే పరిమితం కారాదని.. ట్రాయ్ పేర్కొంది.
అయితే దీనిపై వొడాఫోన్ స్పందించింది. ప్రీమియం పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను వాడుతున్న వారికి ఇతర కస్టమర్ల కన్నా ఎక్కువ స్పీడ్‌తో మొబైల్ ఇంటర్నెట్‌ను అందిస్తే తప్పేమిటని ప్రశ్నించింది. ఇందులో పేద, ధనిక తేడా లేదని.. ప్రీమియం సర్వీసులు కోరుకునే వారు డబ్బు ఎక్కువ పెడతారని, అలాంటప్పుడు వారికి నాణ్యమైన సేవలు అందించడం తప్పేమీ కాదని వ్యాఖ్యానించింది. దీని వల్ల ఇతర కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. నాణ్యమైన సేవలను కోరుకునే వారు డబ్బు ఎక్కువ వెచ్చిస్తారని స్పష్టం చేసింది. అలాంటప్పుడు వారికి అధిక స్పీడ్‌తో ఇంటర్నెట్‌ను అందించడం తప్పేమీ కాదని పేర్కొంది. అయినా తమ రెడ్ఎక్స్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను 8 నెలల కిందటే అందుబాటులోకి తెచ్చామని, అప్పటి నుంచి ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయని, అయినా ఇప్పుడే ట్రాయ్ ఎందుకు దీనిపై స్పందించిందని వ్యాఖ్యానించింది. మరోవైపు ఎయిర్‌టెల్ ట్రాయ్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఇక ఎయిర్‌టెల్ ఇటీవలే ప్లాటినం సేవలను తన పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు అందించడం మొదలు పెట్టింది. అయితే చివరకు ఈ విషయంలో ఏమవుతుందో చూడాలి.