కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నంది విగ్రహం ధ్వంసం కేసులో అరెస్ట్ చేసిన నిందితుల నుంచి పలు కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. శ్రీశైలంలోని మహా నంది విగ్రహం ధ్వంసం కోసం ఈ ముఠా రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. గుంటూరు, హైదరాబాద్, ఇబ్రహీంపట్నంలో మొత్తం 12 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నంది విగ్రహాలలో వజ్రాలు, గుప్తనిధులు ఉంటాయని భావిస్తున్న ఈ ముఠా సభ్యులు నంది విగ్రహాలని టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. గుప్తనిధులు వుంటాయని భావించే మక్కపేటలో నంది విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేసినట్లు గుర్తించారు.
ధ్వంసమైన విగ్రహ స్థానంలో అధికారులు కొత్త విగ్రహం తెచ్చి పెట్టారు. ధ్వంసమైన పాత విగ్రహం తమకు కావాలంటూ మళ్లీ ఈ ముఠా సభ్యులు వచ్చి ఆలయ పూజారిని కలిసినట్టు చెబుతున్నారు. నాలుగు కోట్ల రూపాయలతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామంటూ పూజారికి మాయమాటలు చెప్పినట్లు గుర్తించారు. అయితే పోలీసులకు పూజారి సమాచారం అందించగా పోలీసులు గుప్తనిధుల కోసం ప్రయత్నిస్తున్నామని ముఠాను మఫ్టీలో కలిశారు. అప్పుడే మహానంది విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ముఠా రెక్కీ నిర్వహించారని గుర్తించారు. దీంతో సినీ ఫక్కీలో ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.