మంత్రి కేటీఆర్ పై బిజెపి నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోల్ మైన్ బ్లాక్స్ గురించి మంత్రి కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కమిషన్ల కోసమే తాడిచెర్ల మైన్స్ ను కేసీఆర్ ప్రభుత్వం ఏఏంఆర్ కు అప్పగించిందని ఆరోపించారు. మునుగోడులో బిజెపిి గెలుస్తుందని తేలిపోయిందని.. అందుకే బిజెపిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కంపెనీలపై కేటీఆర్ ఆరోపణలు సరికాదన్నారు.
రాజగోపాల్ రెడ్డికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే 4 కాంట్రాక్టులు దక్కాయే తప్ప బిజెపి ప్రభుత్వం వల్ల రాలేదన్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఉప ఎన్నికను జరపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరామని తెలిపారు. మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు. మునుగోడులో టిఆర్ఎస్ ఓడిపోతుందని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిపి 82 మందికి బూత్ స్థాయిలో బాధ్యతలు అప్పగించారని ఎద్దేవా చేశారు. రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి తరుణ్ చుగ్, బండి సంజయ్, ముఖ్య నేతలు హాజరవుతారని అన్నారు.