ఈటలకు కౌంటర్.. కేసీఆర్‌కు ఫేవర్

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ నేతలు కౌంటర్ స్టార్ట్ చేశారు. ఎమ్మల్యే పదవికి, టీఆర్ఎస్‌ సభ్యత్వానికి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. శనివారం రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌కు అందజేయనున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టి ఏకిపారేశారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు రాజేందర్ వ్యవహారం ఉందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. 2003లో ఈటల రాజేందర్‌కు గెలిచే బలం లేకపోయినా కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి హుజురాబాద్‌లో గెలిపించారని ఎమ్మెల్సీ పల్లా రాజేందర్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్‌లో ఈటలకు ఇచ్చిన గౌరవం మరెవరికి ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటలకు ఇప్పటివరకూ బలం లేదని పల్లా తెలిపారు.

ఆస్తుల కోసమే ఈటల పార్టీ మారారని, ఆప్తుల కోసం కాదని పల్లా పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి పదవి ఇచ్చి ఈటలను సీఎం కేసీఆర్ గౌరవించారన్నారు. రైతు బంధుపై ఈటల చేసిన వ్యాఖ్యలు అవగాహన లేమి అని కొట్టి పారేశారు. ఆస్తుల మీద ప్రేమతో ఆత్మగౌరవం అనే పదాన్ని ఈటల ఇప్పుడు తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఈటల కల్లబొల్లి మాటలను తెలంగాణ వాదులెవరు నమ్మరన్నారన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై అవాకులు, చవాకులు పేలితే ఊరుకునేది లేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. మంత్రిగా ఉండి దేవాదాయ, అసైన్డ్ భూములు ఎలా కొన్నారని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా తీసుకున్న భూములుపై ఫిర్యాదు చేసిన వాళ్లను ఈటల బెదిరిస్తున్నట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.