అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్‌కు 90 రోజుల గడువిచ్చారు. ఆ గడువులోగా అమెరికాలో ఉన్న ఆ సంస్థ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. అలాగే యూజర్ల డేటాను కూడా వదులుకోవాలి. లేదా ఇతర కంపెనీకి టిక్‌టాక్‌ను అమ్మేయాలి. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరొక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
ఇటీవలే ట్రంప్ టిక్‌టాక్‌కు 45 రోజుల గడువునిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అందులో భాగంగా సెప్టెంబర్ 15వ తేదీ లోపు టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ కొనాల్సి ఉంటుంది. లేదంటే ఆ తరువాత ఆ యాప్‌ను బ్యాన్ చేస్తారు. అయితే ఈ విషయంపై టిక్‌టాక్, మైక్రోసాఫ్ట్‌లు ఇప్పటికే చర్చలు జరిపినా.. డీల్ విలువ మరీ తక్కువగా ఉందని టిక్‌టాక్ చర్చలను నిలిపివేసింది. దీంతో మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్ కొనుగోలు పట్ల పెద్దగా ఆసక్తిని చూపించడం లేదని తెలుస్తోంది.
ఇక ట్విట్టర్ కూడా టిక్‌టాక్ కొనుగోలు రేసులో నిలిచినా.. ఆ సంస్థ వద్ద డబ్బు లేదు. ఆ డబ్బును సమీకరించుకునేందుకు చాలా సమయం పడుతుంది. అందువల్ల సెప్టెంబర్ 15 గడువు చాలదు. దీంతో ట్విట్టర్‌కు కూడా టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోయింది. అయితే తాజాగా ట్రంప్ 90 రోజుల పాటు టిక్‌టాక్‌కు గడువునివ్వడంతో.. ఆ సంస్థ కొరత ఊరట చెందుతోంది. అయినప్పటికీ ఆ గడువులోగా టిక్‌టాక్ తన బిజినెస్‌ను విక్రయిస్తుందా, లేదా అన్నది సందేహంగా మారింది. కాగా టిక్‌టాక్ అమెరికా బిజినెస్ విలువ 3 బిలియన్ డాలర్లు ఉంటుందని తెలుస్తోంది. పూర్తి విలువ సుమారుగా 50 బిలియన్ డాలర్లు ఉంటుందని సమాచారం. టిక్‌టాక్‌కు అమెరికాలో మొత్తం 80 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు.