వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరోసారి కన్నెర్ర చేశారు. ఫిబ్రవరిలో పదవి బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. అయితే ఈ చివరి రోజుల్లో కూడా చైనాపై తనకున్న పంథాన్ని వీడటం లేదు. చైనాకు చెందిన మరిన్నీ యాప్ లపై నిషేధం విధించాలని మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. చైనా బిలియనీర్ జాక్ మాకు చెందిన యాంట్ గ్రూపు ఆధ్వర్యంలోని అలీపే, టెన్సెంట్ గ్రూపునకు చెందిన వీచాట్ పే లావాదేవీ యాప్ లతో సహా మొత్తం ఎనిమిదింటిని నిషేధించనున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా మంగళవారం ఉత్తర్వులపై సంతకం చేశారు. యాప్ ల కార్యకలాపాలను త్వరలోనే నిలిపివేయాలని అధికారులకు కూడా ఆదేశించారు.
ఈ యాప్ లపై నిషేధం మరో 45 రోజుల్లో అమలులోకి రానుంది. అప్పటికి ట్రంప్ పదవీ విరమణ చేసి అధ్యక్షుడిగా బైడెన్ కొనసాగుతారు. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని యాప్ లు చైనాకు చేరవేస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకే ఇప్పటికే చైనాకు చెందిన చాలా యాప్లను ప్లేస్టోర్ ల నుంచి తొలగించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం, కాబోయే అధ్యక్షుడు బైడెన్ బృందం స్పందించకపోవడం విశేషం.
టెన్సెంట్ గ్రూపునకు చెందిన క్యూక్యూ వ్యాలెట్, వీచాట్ పే, టెన్సెంట్ క్యూక్యూ అనే యాప్లపైనా నిషేధం విధించారు. గతంలోనూ ట్రంప్ ఓసారి వీచాట్ పేను నిషేధించారు. అప్పట్లో అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీలు యాపిల్, ఫోర్డ్ మోటర్, వాల్ మార్ట్, వాల్ట్ డిస్నీ ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. చైనాలో వ్యాపార నిర్వహణకు ఈ యాప్ లు ఎంతో కీలకమని తెలిపారు. దీన్ని కోర్టులో సవాల్ చేయగా.. ట్రంప్ నిర్ణయాన్ని ధర్మాసనం కొట్టివేసింది. తాజా నిషేధాన్ని కూడా అమెరికా వ్యాపార సంస్థలు వ్యతిరేకించే అవకాశం ఉంది. కాగా, క్యామ్ స్కానర్, షేర్ ఇట్, వీమేట్, డబ్ల్యూపీఎస్ ఆఫీస్ వంటి యాప్ లు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి.