ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు ఉత్తమ సర్వీసులను, ఫీచర్లను అందించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే తన పాలసీలకు కూడా మార్పులు, చేర్పులు చేస్తూ వస్తోంది. అయితే వాట్సాప్ తాజాగా మరోసారి తన ప్రైవసీ పాలసీ, టర్మ్స్ ఆఫ్ సర్వీస్‌కు మార్పులు, చేర్పులు చేసింది.
వాట్సాప్‌లో యూజర్లకు చెందిన సమాచారాన్ని వాట్సాప్ తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో షేర్ చేస్తుందని గతంలో వాట్సాప్‌పై విమర్శలు వచ్చాయి. అయితే ఇదే విషయంపై వాట్సాప్ తన కొత్త పాలసీలో తెలియజేసింది. తాము వాట్సాప్ యూజర్ల డేటాను ఎలా సేకరిస్తాము, ఎలా ఫేస్‌బుక్‌కు, ఇతర ఫేస్‌బుక్‌కు చెందిన సర్వీస్‌లకు షేర్ చేస్తాము.. అన్న వివరాలను వాట్సాప్ తన నూతన పాలసీలో ఉంచింది. అలాగే వాట్సాప్ పేమెంట్స్ డేటా, ట్రాన్సాక్షన్స్ తదితర అంశాలకు చెందిన డేటాను కూడా ఎలా హ్యాండిల్ చేస్తాము.. అన్న వివరాలను కూడా వాట్సాప్ తన నూతన పాలసీలో చేర్చింది.
కాగా వాట్సాప్ రూపొందించిన నూతన ప్రైవసీ పాలసీ, టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఫిబ్రవరి 8 నుంచి అమలులోకి రానుంది. దీంతో వాట్సాప్‌లో యూజర్లకు ఒక నోటీస్ వస్తుంది. కొత్త ప్రైవసీ పాలసీ, టర్మ్స్ ఆఫ్ సర్వీస్ కు యూజర్లు ఓకే చెప్పాల్సి ఉంటుంది. దీంతో వారు వాట్సాప్ సేవలను యథావిధిగా ఉపయోగించుకోవచ్చు. లేదంటే అకౌంట్‌ను వాడుకోలేరు. వాట్సాప్ అకౌంట్‌ను కోల్పోవాల్సి వస్తుంది. అయితే నూతన ప్రైవసీ పాలసీ, టర్మ్స్ ఆఫ్ సర్వీస్ కు చెందిన మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.