కరోనా తగ్గితే వచ్చే నెలాఖరులో ఇంటర్మీటియేట్ పరీక్షలు నిర్వహించాలని సర్కార్ యోచిస్తోంది. ఈ వివరాలను నిన్న కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా చెప్పినట్లు సమాచారం.
కరోనా కారణంగా తెలంగాణ ప్రభుత్వం టెన్త్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేసిన సర్కార్ సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నటు గతంలో ప్రకటించింది. అదేవిధంగా జూన్ మొదటి వారంలో సమావేశం నిర్వహించి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.కానీ, పరీక్షలు ఉంటాయా? లేవా? అన్న అంశంపై అనేక వార్తలు వస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఒకవేళ కరోనా కేసుల నమోదు తగ్గితే వచ్చే నెల అంటే జూన్ చివరలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అవకాశం లేని పక్షంలో ఇతర ప్రత్యామ్నాయ ప్రణాళికలను సైతం ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలను ఆదివారం రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వెల్లడించినట్లు సమాచారం.
కొవిడ్ కేసులు తగ్గకుండా, విపత్కర పరిస్థితే మళ్లీ ఏర్పడితే ఇంటర్ పరీక్షలను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడితే ఫస్ట్ ఇయర్‌లో విద్యార్థులు సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుని వాటి ఆధారంగానే సెకండియర్ ఫలితాలను సైతం విడుదల చేయాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించినట్లు తెలుస్తోంది. దీనిపై జూన్ 1 వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. తనంతరం నిర్ణయం వెల్లడించనున్నారు.