తెలంగాణలోని గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న ఫౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న ఫౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఇంటి పన్నును మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందని పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఫౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఇంటి పన్ను నుంచి మినహాయింపు ఇచ్చినందుకు మంత్రి ఎర్రబెల్లి రావు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
కాగా గత కొన్ని సంవత్సరాలుగా ఫౌల్ట్రీ, డెయిరీ యూనిట్ల యజమానులు ఆస్తి పన్నును రద్దు చేయాలని కోరుతున్నారని మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు. వారి వినతిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలోని ఫౌల్ట్రీ రైతులు, డెయిరీ యూనిట్ల వారు ఎంతో లబ్ధిపొందుతారని తెలిపారు. ఇక ఆస్తిపై హక్కు పొందడానికి సంవత్సరానికి వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని మంత్రి వెల్లడించారు.ఈ నిర్ణయం ద్వారా ఫౌల్ట్రీ, డెయిరీ రంగంలో కొత్త వారు రావడానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొన్ని రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నారు.