రాష్ట్రంలో రోజురోజుకీ చలి తీవ్రత పెరిగి పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. గత రెండు రోజులతో పోలిస్తే ఆదివారం రోజున ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి.సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. బేలలో 9.1, బజార్‌హత్నూర్‌లో 9.3, నిర్మల్‌లో 9.5, ఆసిఫాబాద్‌లో 8, గిన్నెదరిలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, సికింద్రాబాద్లో అత్యధికంగా 15 డిగ్రీస్ ఉష్ణోగ్రత నమోదయింది. ఇంకా మూడు రోజులపాటు 11 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.ఉత్తర, ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తుండడం వలన చలి ప్రభావం అధికంగా ఉందని చెప్పారు. భారీ పొగ మంచు ఉండటంతో వాహనదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.
చలి తీవ్రత ఉంది కావున చిన్నపిల్లలు , వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. చలిలో ఎక్కువగా బయట తిరగకూడదని ముఖ్యంగా వృద్ధులు దట్టంగా ఉన్న ఉన్ని దుస్తులు వేసుకోవాలని సూచిస్తున్నారు. చలి ప్రభావం వలన వృద్ధులు గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంటుందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.