తెలంగాణ గ్రూప్-1 ప్రధాన పరీక్షలు (మెయిన్స్) షెడ్యూలు ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో అనుమానాలకు తావులేకుండా ఇకనుంచి నిర్వహించే పోటీ పరీక్షలకు కొత్త ప్రశ్నపత్రాలు రూపొందిస్తామని తెలిపారు. దీనికి కొంత సమయం పడుతుందని చెప్పారు.
ఏప్రిల్ 4 నుంచి జరిగే పరీక్షలన్నీ షెడ్యూలు ప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జనార్దన్ రెడ్డి చెప్పారు. ఏఈ పరీక్షపై మంగళవారం సాయంత్రం సమావేశమై నిర్ణయం తీసుకోవాలని భావించినప్పటికీ పోలీసుల నివేదిక రావడంలో ఆలస్యమైందన్నారు. దీనిపై కమిషన్ బుధవారం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీలో నమ్మిన ఉద్యోగులే గొంతు కోశారన్నారు.
‘‘ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు, కమిషన్ కార్యాలయ ఉద్యోగి ప్రవీణ్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాశాడు. సామాజిక మాధ్యమాల్లోకి వచ్చిన అతని ఓఎంఆర్ పత్రం వివరాలను సరిచూశాం. అతనికి 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమే. అతనికి వచ్చిన మార్కులే ప్రిలిమినరీలో అత్యధికం కాదని వెల్లడైంది. ప్రధాన పరీక్షకు అతను అర్హత సాధించలేదు. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన ఆధారాల అనుగుణంగా గ్రూప్-1 ప్రధాన పరీక్షపై షెడ్యూలు ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించాం.