తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారం పీటముడిలా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని కేసీఆర్ సర్కారు తేల్చి చెబుతుండగా.. కార్మికులు కూడా సమ్మెను విరమించడానికి సిద్ధపడటం లేదు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 37వ రోజుకు చేరుకుంది. నేడు అన్ని డిపోల వద్ద కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ జేఏసీ నేతలు, అఖిలపక్షం నేతలు సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో చర్చించనున్నారు.
శనివారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో ట్యాంక్‌బండ్ రణరంగంగా మారింది. నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు కొందరు ప్రముఖ నేతలను పోలీసులు ముందస్తుగా గృహ నిర్భందం చేశారు. పోలీసుల చర్యను అఖిలపక్ష, జేఏసీ నేతలు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం అణచివేయడం తగదని నేతలు మండిపడ్డారు.