అడవి బిడ్డల కోసం ఏర్పాటైన ఈ అందమైన ప్రభుత్వం తెలుసా…? ఎక్కడ ఉందో తెలుసా…?

-

క్రాంతికారి జనతన సర్కార్” బహుసా దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఉన్న మనకు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలు అనుసరించే విధానాల గురించే మాత్రమె అవగాహన ఉంటుంది గాని రాజకీయ పార్టీలు, ఈవియెం మెషిన్లు, ఓటుకి నోటు, నాయకులు, మత ఘర్షణలు, వివాదాలు, మీడియా ఇలాంటి అనవసర విషయాలు ఏమి లేకుండా ఏర్పడిందే క్రాంతికారి జనతన సర్కార్. అడవి బిడ్డల కోసం ప్రభుత్వాలు కార్యక్రమాలు చేయకపోతే అక్కడ ఉండే కొందరు నిర్మించిన ఒక నిజాయితి గల ప్రజాస్వామ్య వ్యవస్థే ఈ క్రాంతికారి జనతన సర్కార్.

ఇది ఒక సమాంతర ప్రభుత్వం… తమను నమ్మిన ప్రజలకు ఈ సర్కార్ లో సమాంతర న్యాయం జరుగుతుంది. చత్తిస్గడ్, మహారాష్ట్ర, తెలంగాణా సరిహద్దుల్లో, అభూజ్ మడ్ దండకారుణ్యంలో ఈ జనతన సర్కార్ నడుస్తుంది. చితికిన బతుకులు ఎలా ఉంటాయి అనే ప్రశ్నకు ఈ ప్రాంతాలు సజీవ సాక్ష్యం. వేలాది మంది అడవి బిడ్డలు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోక బిక్కుబిక్కుంటూ కాలం వెళ్ళదీస్తూ తమను ఎవరో వచ్చి బాగు చేయరు తమను తామే బాగు చేసుకోవాలని భావించి సర్కార్ ని వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో విద్వేషాలకు తావు లేకుండా ఒక సమాంతర ప్రభుత్వం తన బాధ్యత నిర్వహిస్తూ ఉంటుంది.

అడవిబిడ్డలకు ఆ అడవి సొంతం… వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వారి జీవనం కోసం వారు ఏదైనా చేసుకొని జీవించవచ్చు. అందుకే అక్కడ ఉన్న వేలాది ఎకరాలను చదును చేసి, చెరువులు, కుంటలు తవ్వించి పేదలకు పంచుతుంది ఈ జనతన సర్కార్. పీడిత ప్రజల కోసం పోరాడుతున్న మావోల సహకారంతో ఈ సర్కార్ తన సేవలు అందిస్తుంది. అందరికి భూమి ఉండాలని భావించి పేదవారికి పట్టెడన్నం పెట్టాలనే సిద్దాంతంతో ఈ ప్రభుత్వం అక్కడ సేవలను అందిస్తుంది. చదువులేని తమ బిడ్డల కోసం బడి కట్టించి గోడు లేని తమ తోటి మనుషులకు గూడు కట్టించి… ఆకలి అనే పదానికి తావు లేకుండా పని చేస్తుంది.

ఇతర విషయాలను పక్కన పెట్టి ఇక్కడి స్కూల్స్ విషయానికి వచ్చి చూద్దాం… మనలా పాస్ ఫెయిల్, మార్కులు, కటౌట్, బ్యానర్ ఇలాంటి సోది సొల్లు కబుర్లు వారి దగ్గర ఉండవు. అక్కడ ఏర్పడిన కొన్ని కమిటీలు తాము ఏర్పాటు చేసుకున్న సర్కార్ ఇచ్చిన ఆర్ధిక సాయంతో కొన్ని బడులను కట్టించి పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నారు. కోయ బాష నుంచి ఇంగ్లీష్ వరకు వారికి చదువు నేర్పిస్తున్నారు. తమ జీవితాల మాదిరి తమ బిడ్డల జీవితాలు అడవి తల్లికి అంకితం కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు కష్టపడి పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. ఈ సర్కార్ బడులలో ఎక్కడా కూడా ఒక విద్యార్ధిని పొగడటం మరో విద్యార్ధిని కొట్టడం లాంటివి ఉండవు.

కేవలం వారి తెలివి తేటల ఆధారంగానే వారిని పై చదువులకు పంపిస్తారు. వారి వైద్య సేవలకు కూడా జనతన సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మావోల నుంచి వచ్చే మందులతో పాటు మార్కెట్ లో దొరికే విలువైన మందులను వారి కోసం సిద్దంగా ఉంచుతున్నారు. కొందరు వైద్యులను కూడా వారికోసం సిద్దంగా ఉంచి ఏ ఇబ్బంది రాకుండా చూస్తారు. చదువుకునే పిల్లలు తల్లి తండ్రులకు భారం కాకూడదు అనే ఉద్దేశంతో వారికి నాణ్యమైన ఆహారం, బట్టలు, పుస్తకాలను అందిస్తూ ఉంటారు. ఆటపాటల్లో కూడా వారికి ఏ లోటు చేయదు జనతన సర్కార్… స్కూల్ కోసం స్థలాన్ని చదును చేసినప్పుడే ఆట పాటల కోసం కోసం కొంత స్థలాన్ని సిద్దంగా ఉంచి ప్రముఖ క్రీడలను నేర్పిస్తారు.

క్రికెట్, వాలీబాల్, షటిల్ వంటివి వారికి శిక్షణ ఇస్తారు. మన స్కూల్స్ మాదిరి కేవలం చదువు, సాంకేతిక పరిజ్ఞానం మాత్రమె నేర్పించకుండా ప్రాణ రక్షణ కోసం ఏం చెయ్యాలి, చితికిన బతుకులు అంటే ఎలా ఉంటాయి, తల్లి తండ్రులు పడిన కష్టాలు, ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయం, అసలు తమ జీవితాలు ఇలా ఎందుకు ఉన్నాయి, కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనే ప్రతీ విషయాన్ని వారికి నేర్పిస్తూ ఉంటారు. ఎవరూ కూడా ఎక్కడా కూడా భయపడకుండా జీవించడానికి అవసరమైన మార్గాలను చూపిస్తారు. మావోల సహకారంతో నడుస్తున్న ఈ సర్కార్ సాధారణ ప్రపంచానికి దూరంగా ఉన్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నుకున్న ప్రభుత్వాల కంటే మంచి సేవలు అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news