కరోనా వైరస్ కేసుల సంఖ్య భారత్‌లో నెమ్మదిగా అయినా సరే.. రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ప్రజలను ఈ వైరస్ పట్ల అప్రమత్తం చేస్తున్నాయి. ఇక ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ట్వీట్ చేస్తూ.. అనవసరంగా ఎవరూ బయట తిరగవద్దని, కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తలు పాటించాలని.. సూచించారు. కాగా అటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా భక్తులకు కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలను తెలియజేస్తోంది.
తిరుమలకు వచ్చే భక్తులను పరిశీలించడం కోసం టీటీడీ.. శ్రీవారి మెట్టు, అలిపిరి మార్గాల్లో కరోనా వైరస్ కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అలాగే నడక దారిలో తిరుమలకు చేరుకునే భక్తుల కోసం డాక్టర్లు ఇప్పటికే థర్మల్ గన్‌తో పరీక్షలు చేస్తున్నారు. ఇక దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు తిరుమలకు రావద్దని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. భక్తులు తిరుమలకు వచ్చే ముందే హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులను కచ్చితంగా తీసుకుని రావాలని సూచిస్తున్నారు.
ఇక విదేశాల నుంచి వచ్చిన భక్తులు లేదా విదేశీయులు తిరుమలకు రావద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమలకు నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారని, కనుక కరోనా వైరస్ సులభంగా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుందని, కాబట్టి భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాము తెలియజేస్తున్న సూచనలను వారు పాటించాలని టీటీడీ కోరింది. భక్తులు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.