వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు పది రోజుల పాటు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని ఇటీవలే తెలిపింది. అంతేగాక ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా వస్తేనే బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించింది. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలో టీటీడీ ఈఓ శ్యామల రావు వెల్లడించారు.
తాజాగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించేందుకు అనుమతించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ మేరకు తితిదే ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై ఆదివారం, సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు; బుధవారం, గురువారం ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రూ.300 ఉంటాయని టీటీడీ తెలిపింది. నిర్దేశిత రోజుల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించి ఒక లేఖ మాత్రమే స్వీకరిస్తామని పేర్కొంది. మార్చి 24 నుంచి అమలు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.