వావ్‌.. రికార్డులకెక్కిన ట్రాన్స్‌జెండర్‌లు..

-

నేటి సమాజంలో ట్రాన్స్‌జెండర్‌లంటే చులకనభావం ఎక్కువ. వారిని కూడా గౌరవించేవారి సంఖ్య తక్కువగానే కనిపిస్తుంది. అయితే.. అలాంటి అవమానాలకు ఓర్చుకున్న ఓ ఇద్దరు ట్రాన్స్‌జెండర్‌ అరుదైన రికార్డు నెలకొల్పారు. హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రిలో తొలిసారి ఇద్దరు ట్రాన్స్‌జెండర్ వైద్యులు విధుల్లో చేరి రికార్డులకెక్కారు. కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులైన వీరిద్దరూ యాంటీ రిట్రోవైరల్ విభాగంలో సేవలందించనున్నారు. వీరిలో ఒకరు ఖమ్మం జిల్లాకు చెందిన రుత్ జాన్‌పాల్ కొయ్యాల కాగా, మరొకరు ఆదిలాబాద్ రిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన ప్రాచి రాథోడ్. రుత్ జాన్‌పాల్ 2018లో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. ఆ తర్వాత నగరంలో వైద్యురాలిగా ప్రాక్టీస్ చేయాలని తలపోసినా ప్రయత్నాలు సఫలం కాలేదు. ట్రాన్స్‌జెండర్ అన్న కారణంతో ఎవరూ అవకాశం ఇవ్వలేదు. చివరికి గతేడాది నారాయణగూడలో తన స్నేహితురాలైన డాక్టర్ ప్రాచితో కలిసి ‘మిత్ర’ ట్రాన్స్‌జెండర్ క్లినిక్ ఏర్పాటు చేశారు.

ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులుగా ట్రాన్స్‌జెండర్లు!

ఇప్పుడా క్లినిక్‌కు చుట్టుపక్కల మంచి పేరుంది. అయితే, ఇప్పుడీ వైద్యులకు ఉస్మానియా ఆసుపత్రి నుంచి కాంట్రాక్ట్ వైద్యులుగా అవకాశం రావడంతో ఆలస్యం చేయకుండా ఓకే చెప్పేశారు. ఇక, ఆదిలాబాద్ రిమ్స్‌లో ఎంబీబీఎస్, ఎమర్జెన్సీ మెడిసన్ పూర్తి చేసిన ప్రాచి రాథోడ్ ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో మూడు సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఆమె ట్రాన్స్‌జెండర్ అన్న విషయం తెలిసి ఉద్యోగం నుంచి తొలగించారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణలో పేరుమోసిన ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యురాలిగా చేరారు. ట్రాన్స్‌జెండర్ వైద్యులకు ఆసుపత్రిలో అవకాశం కల్పించడంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ.. చాలా ఆనందంగా ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news