దుబాయ్‌ పోలీసు చేసిన పనికి కన్నీళ్లు పెట్టిన హైదరాబాదీ డాక్టరమ్మ

-

ఒక్కసారిగా పోలీసు రోడ్డు మీద అకస్మాత్తుగా ఆపేసరికి గుండె ఆగిపోయినట్టయింది ఆ అమ్మాయికి. తను డాక్టరునని చెప్తున్నావినకుండా, ఆ పోలీసు చేసిన పనికి కన్నీళ్లాపుకోలేకపోయింది.

అప్పుడు సమయం… అర్ధరాత్రి ఒంటిగంట..

ప్రదేశం… అల్‌ ములా ప్లాజా ముందు… దుబాయ్‌-షార్జా హైవే., దుబాయ్‌.

కారులో రయ్యిన దూసుకుపోతోంది.. డాక్టర్ ఆయేషా సుల్తానా. అప్పుడే అల్‌ అహ్లీ స్క్రీనింగ్‌ సెంటర్‌లో డ్యూటీ దిగి షార్జాలోని ఇంటికి వెళుతోంది ఆమె. ప్రత్యేకించి కొవిడ్‌-19 పేషెంట్లను పరిశీలించే విధిలో ఉంది ఆయేషా. హైదరాబాద్‌ వాస్తవ్యురాలైన ఆయేషా, తండ్రితో కలిసి షార్జాలో నివసిస్తూ, దుబాయ్‌లో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది.

ఆకస్మాత్తుగా ఓ పోలీసుఅధికారి తన కారును ఆపేసరికి, ఆయేషా షాక్‌ తింది. వెంటనే, తన గుర్తింపు పత్రాలను, లాక్‌డౌన్‌ సమయంలో ప్రయాణించేందుకు ఇచ్చిన అనుమతి పత్రాలు తీసి చూపించబోతుండగా, ఆ ఆఫీసర్‌ ఒక్కసారిగా ‘‘సెల్యూట్‌’’ చేసాడు. ‘‘ మీరు  నాకేమీ చూపించాల్సిన అవసరం లేదు డాక్టర్‌’’ అని అనగానే ఆయేషాకు నోటమాటరాలేదు. కన్నీళ్లు మాత్రం ఆగకుండా ప్రవహించాయి. పని ఒత్తిడితో అలసిపోయి ఉన్న ఆయేషాకు ఆ పోలీసు వందనం వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది. ‘‘ నాలో చుట్టుముట్టిన భావోద్వేగాల పరంపరతో అసలు నాకేం చేయాలో తోచలేదు. అతని పేరు తెలియదు. మాస్క్‌ ధరించి ఉండటం వల్ల అతని ముఖం కూడా తెలియకుండాపోయింది. కానీ అతనికి థాంక్స్‌ చెప్సాలని బాగాఉంది’’ అంది ఆయేషా.

ఆయేషా తన ఈ అనుభవాన్ని ట్విటర్‌లో పంచుకోగానే, విపరీతంగా వైరల్‌ అయిపోయిందా ట్వీట్‌.  ‘‘ ఈరోజు నా జీవితంలో మరపురాని రోజు. మీ చర్యలకు ధన్యవాదాలు. యూఏఈలో ఉండి ప్రజలకు సేవ చేయగలుగుతున్నందుకు నేను అదృష్టవంతురాలిని’’ అని ఆ పోలీసు అధికారిని ఉద్దేశించి ఆ ట్వీట్‌లో తెలిపింది ఆయేషా.

ఆ ట్వీట్‌ను చూసిన దుబాయ్‌ పోలీసులు ఆయేషాను ఫోన్‌లో పలకరించారు. దుబాయ్‌ పోలీసు శాఖలోని హ్యాపీనెస్‌ అండ్‌ పాజిటివిటీ కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అవాతిఫ్‌ అల్‌ సువైదీ తండ్రికి ఫోన్‌ చేసి, దుబాయ్‌ పోలీసుల తరపున ఆయేషా సేవలకు కృతజ్ఞతలు తెలిపింది. ఆయన కూడా వారి మంచితనానికి కన్నీళ్లు ఆపుకోలేకపోయాడని ఆయేషా తెలిపింది. ఈ ఒక్క సెల్యూట్‌ నాకు, నా కుటుంబసభ్యుల  జీవితంలో ఒక పెద్ద విషయంగా మారిపోయింది. చాలా సంతోషంగా, గర్వంగా ఉందని ఆయేషా పట్టరాని ఆనందంతో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news