క్షణాల్లో రుచికరంగా ఉగాది పచ్చడిని ఇలా తయారు చేసేసుకోండి..!

తెలుగు సంవత్సరం ప్రకారం మొదట వచ్చే పండుగ ఉగాది పండుగ. ఈ ఏడాది ఉగాది పండుగ ఏప్రిల్ 2న వచ్చింది. ఉగాది నాడు అందరూ కలిసి ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే మరి ఉగాది గురించి, ఉగాది పచ్చడి గురించి ఎన్నో విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఉగాది నాడు తప్పని సరిగా ఉగాది పచ్చడి తినాలి. ఉగాది రోజు వేపపువ్వు, మామిడికాయ వగైరా పదార్థాలను వేసి పచ్చడిని తయారు చేసుకోవాలి. తరతరాల నుండి వస్తున్న ఆనవాయితీ ఇది. ఆరు రుచులతో ఉగాది పచ్చడి ఉంటుంది. అయితే మరి అసలు ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలి..?, దానికి కావలసిన పదార్థాలు ఏమిటి..?, సులభంగా దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

ఉగాది పచ్చడి కి కావలసిన పదార్థాలు:

బెల్లం 100 గ్రాములు
చింతపండు 50 గ్రాములు
ఒక మామిడికాయ
మూడు పచ్చిమిర్చి
ఒక చిన్న ముక్క అల్లం
వేపపువ్వు అరకప్పు
ఉప్పు కొద్దిగా

ఉగాది పచ్చడి తయారు చేసుకునే విధానం :

ఉగాది పచ్చడి చేయడానికి ముందు బెల్లాన్ని పొడి కింద చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని పక్కన పెట్టుకొని చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టి గుజ్జు తీసి ఉంచుకోవాలి. మామిడి తొక్కను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలానే పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు బెల్లం, మామిడి, చింతపండు, పచ్చిమిర్చి, వేప పువ్వు, ఉప్పు వేసి బాగా కలిపి తయారు చేసుకోవాలి.

ఈ ఉగాది పచ్చడి లో బెల్లం సంతోషానికి ప్రతీక. ఉప్పు జీవితం పట్ల మక్కువను సూచిస్తుంది. వేపపువ్వు జీవితంలో కష్టాలను సూచిస్తుంది. చింతపండు సవాళ్ళని సూచిస్తుంది. మామిడి కొత్త సవాళ్లను, ఆశ్చర్యాన్ని సూచిస్తుంది. పచ్చిమిర్చి కోపాన్ని కలిగించే జీవిత క్షణాలని సూచిస్తుంది.