ఏడాదికిపైగా ఉక్రెయిన్ ప్రజలు రష్యా దురాక్రమణను ఎదుర్కొంటున్నారు. ఈ యుద్ధంలో ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది క్షతగాత్రులయ్యారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రపంచ దేశాల సాయం కోరుతోంది. ఇందులో భాగంగానే తాజాగా అదనపు మానవతా సాయం కోరుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ప్రధాని మోదీకి లేఖ రాశారు.
ఉక్రెయిన్ దేశ విదేశాంగ ఉప మంత్రి ఎమినే జపరోవా భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి జెలెన్‌స్కీ రాసిన లేఖను ఆమె విదేశాంగ శాఖకు అందించారు. వైద్య సామగ్రి వంటి అదనపు మానవతా సాయం అందించాలని అందులో కోరారు. అందుకు భారత్ ముందుకువచ్చిందని వెల్లడిస్తూ మన విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ట్విటర్‌లో స్పందించారు. అలాగే ఉక్రెయిన్ పునర్నిర్మాణం భారత సంస్థలకు ఓ అవకాశమని జపరోవా తెలిపారు.
యుద్ధం తర్వాత మొదటిసారి భారత్‌లో పర్యటిస్తోన్న జపరోవా .. మనదేశంపై ప్రశంసలు కురిపించారు. ‘భారత్ ఒక గ్లోబల్ ప్లేయర్.. విశ్వ గురువు అని నేను భావిస్తున్నాను’ అని అన్నారు.