యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్) వరుసగా రెండో ఏడాది కూడా దేశంలోని టాప్ 10 యూనివర్సిటీల్లో 4వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు వర్సిటీ మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ది వీక్ – హన్సా రీసెర్చ్ సర్వే ప్రకారం.. ఈ ఏడాది కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) టాప్ 10 వర్సిటీల్లో 4వ స్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా హెచ్‌సీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పొదిలి అప్పారావు మాట్లాడుతూ.. తమ యూనివర్సిటీలోని విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, ఫ్రొఫెసర్లు, రీసెర్చి స్కాలర్లు చేస్తున్న కృషి వల్లే వర్సిటీకి ఈ ఏడాది కూడా నంబర్ 4 స్థానం దక్కిందన్నారు. 2019లో దేశంలోని టాప్ 10 యూనివర్సిటీల్లో హెచ్‌సీయూ 4వ స్థానంలో నిలిచిందని, దాన్ని ఈ ఏడాది నిలబెట్టుకున్నామని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమణాలు కలిగి ఉండేలా యూనివర్సిటీని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు.
కాగా దేశవ్యాప్తంగా ఉన్న 600కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యాబోధన, ఫ్యాకల్టీ, రీసెర్చి సదుపాయాలు, ఇతర సౌకర్యాలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్ల శాతం.. తదితర అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే చేసి మరీ దేశంలోని టాప్ 10 యూనివర్సిటీల వివరాలను వెల్లడిస్తున్నారు. ఇక ఈ సారి కూడా ఇందులో భాగంగా హెచ్‌సీయూకు 4వ స్థానం దక్కింది.