చిత్తూరు రాజకీయాలు ఒకంతట అంతుపట్టవు. తమిళనాడుతో సరిహద్దు పంచుకునే నగరి నియోజకవర్గంలో కథంతా నడిపేది ఒకరు.. నడిపించేది ఒకరు. దీంతో ఎవరు ఎటు అన్నది తేల్చుకోవడం కష్టం. దీంతో అక్కడ రాజకీయం పై ఫోకస్ చేయడం అన్నది అంత సులువు కాదు. పెద్దిరెడ్డి లాంటి బలమైన శక్తులను ఢీ కొనడం అన్నది ఎవ్వరికీ అంత సులువు కాదు. కానీ ఆ ప్రయత్నం ఒకరు చేస్తున్నారు ఆ వివరం ఈ కథనంలో!
వైసీపీ వర్గాల్లో తిరుగులేని నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. సినిమా నుంచి రాజకీయం వరకూ ఎదురేలేదని అనిపించుకున్నారు. అనూహ్యం అయినా టీడీపీ నుంచి వైసీపీకి వచ్చి తన సమర్థతను నిరూపించుకున్నారు. రెండు సార్లు నగరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయి విజయ దుందుభి మోగించారు షీ ఈజ్ నన్ అదర్ దేన్ రోజా. కానీ ఇప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఎన్నో అవమానాలు భరిస్తున్నారు. ఎన్నో అవరోధాలు దాటేందుకు శ్రమిస్తున్నారు. ఒకనాడు వైసీపీ ట్రబుల్ షూటర్ గా ఉన్న రోజా ఇవాళ మాత్రం అస్సలు మాట్లాడేందుకే అవకాశం లేకుండా పోతోంది. ఎక్కడికక్కడ ఆమెను నిలువరిస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రాజకీయం నడుపుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పెద్దిరెడ్డి హవా ముందు ఎవ్వరయినా తలదించాల్సిందే అన్న మాట రోజా విషయంలో రుజువు అవుతోంది. దీంతో చేసేది లేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెబుతున్నారు.
ముఖ్యంగా శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవిని చక్రపాణి రెడ్డికి ఇవ్వడంతో ఆమె భగ్గుమన్నారు. తనను వ్యతిరేకించే వారికి పదవులు వరించడం, అందుకు పెద్దిరెడ్డి సహకరించడం ఆమెకు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో తాజా నియామకాలపై జగన్ దగ్గరే తేల్చుకుంటానని రోజా అంటున్నారు.
వాస్తవానికి నగరి నియోజకవర్గం అంతా పెద్దిరెడ్డి మనుషులే హవా సృష్టిస్తున్నారు. మొన్నటి స్థానిక ఎన్నికలతో పాటు, నగరి మున్సిపల్ ఎన్నికల్లో కూడా రోజా మాట నెగ్గలేదు. ఆమె వ్యతిరేక వర్గం అంతా ఏకమయి నాటి ఎన్నికల్లో పనిచేశారు. అంతేకాదు
జిల్లాలో పెద్దిరెడ్డి మాటను దాటి ఎవ్వరూ ఉండరు. ఆఖరికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా పెద్దిరెడ్డి మాటే వింటారు.
ఇన్ని సవాళ్ల మధ్య రోజా తన పని తాను చేసుకుని పోవడానికి అడ్డంకులు ఎదుర్కొంటునే ఉన్నారు. ఆర్థికంగా కూడా ఆమె పెద్దగా చెప్పుకునే స్థాయిలో లేరు అని కూడా తెలుస్తోంది. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైనా కూడా పెద్దగా కూడబెట్టుకున్నదీ ఏమీలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోజా రాజకీయం ఎటువైపు?
– పొలిటికల్ పొలికేక – మన లోకం ప్రత్యేకం