ఐదారు దశాబ్ధాల పాటు దేశంలో చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఘోర పరాభవాలను ఎదర్కొంటోంది. తాాజాగా యూపీ ఎన్నికల్లో అత్యంత చెత్త రికార్డ్ ను నమోదు చేసింది. 403 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థుల్లో 97 శాతం మంది అభ్యర్థులు తమ డిపాజిట్లను కోల్పోయారు. కేవలం 2.4 శాతం ఓట్లను మాత్రమే కాంగ్రెస్ సంపాదించింది. 403 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం రెండు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
యూపీలో ఒక నాడు అధికారం చేపట్టిన బహుజన్ సమాజ్ వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో నామమాత్రంగా మారింది. కేవలం ఒక స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుంది. యూపీ ఎన్నికల్లో 347 స్థానాల్లో పోటీ చేసి సమాజ్ వాదీ పార్టీ 6 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. మరోవైపు అధికారం చేపట్టనున్న బీజేపీ కూటమిలో బీజేపీ పార్టీ 376 స్థానాలకు పోటీ చేస్తే కేవలం 3 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది.