ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని ఆయన ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఆర్టీసీకి రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1099 కోట్లు ఉన్నాయని, వీటిలో 42 శాతం తెలంగాణ, 58 శాతం ఏపీ చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఆర్టీసీకి ఇప్పటి వరకు రూ.4,235 కోట్లు ఇచ్చామని ఏజీ తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఆర్టీసీకి ఎంత ఇచ్చారో చెప్పమనలేదని, బకాయిలు ఎంతో స్పష్టంగా చెప్పాలని సూచించింది.
రూ.4,235 కోట్లు ఇస్తే బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదా ? అని ప్రశ్నించింది. నివేదికలో అధికారులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారని ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. రూ.4,235 కోట్లు అంటూ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించింది. కేవలం రూ.850 కోట్లకే బ్యాంకు గ్యారంటీ ఇచ్చారని, ఉద్దేశ పూర్వకంగానే నివేదికను అస్పష్టంగా ఇచ్చారని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రూ.100 కోట్ల వరాలు ప్రకటించడాన్ని తప్పు పట్టింది. ఒక నియోజకవర్గంలో ఇంత కేటాయిస్తున్న ప్రభుత్వం రూ.47 కోట్లు ఇవ్వలేదా అని ప్రశ్నించింది.
అసలు ఎన్ని బస్సులు నడుపుతున్నారని సర్కార్‌ను హైకోర్టు ప్రశ్నిస్తే, 70 శాతం బస్సులు నడుపుతున్నామని చెప్పడంతో హైకోర్టు సీరియస్ అయింది. బస్సులు అన్ని నడవడం లేదని సర్కారు తీరును తప్పుపట్టింది. దీంతో సర్కారు గొంతులో వెలక్కాయ పడినట్లు అయింది. సర్కారు తీరు సరిగా లేదని కోర్టు వ్యాఖ్యానించడం విశేషం. కేసును శుక్రవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఆర్టీసీ ఫైనాన్స్ సెక్రటరీ, ఎండీ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.