రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు లేదా ప్రమాదం జరిగినప్పుడు నష్టం తీవ్రత తక్కువగా ఉండేందుకు గాను ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ను కచ్చితంగా ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు హెల్మెట్ నిబంధనను కచ్చితంగా, కఠినంగా అమలు చేస్తున్నాయి కూడా. హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడిపి పట్టుబడితే భారీ ఎత్తున చలాన్లు వేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హెల్మెట్ లేకుండా వాహనాలను నడిపే వారిపై ప్రత్యేకంగా డ్రైవ్‌లు కూడా చేపడుతున్నారు. అయితే ఇకపై ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్‌లనే ధరించాలట. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది.
ఐఎస్ఐ గుర్తింపు లేని హెల్మెట్లకు భద్రత ఏమాత్రం ఉండడం లేదని, అందుకే వాటిని ధరించినప్పుడు ప్రమాదం జరిగితే నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుందని, కనుక ఇకపై ఐఎస్ఐ గుర్తింపు ఉన్న హెల్మెట్లను మాత్రమే ధరించాలని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఓ నూతన నిబంధనను అమలులోకి తెచ్చింది. ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్ ఇనిస్టిట్యూట్) గుర్తింపు లేని హెల్మెట్లను నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కేంద్రం అమలులోకి తెచ్చిన ఈ నిబంధన ప్రభావం విదేశీ కంపెనీ హెల్మెట్లపై పడనుంది. పలు విదేశీ కంపెనీలు ఐఎస్ఐ గుర్తింపు లేని హెల్మెట్‌లను చాలా తక్కువ ధరకే విక్రయిస్తున్నాయి. అందువల్ల చాలా మంది వాహనదారులు వాటినే కొనుగోలు చేస్తున్నారట. అయితే ఇకపై ఇలా చేయడం కుదరదు. ఐఎస్ఐ గుర్తింపు ఉన్న హెల్మెట్లనే వాహనదారులు వాడాలి. కంపెనీలు కూడా వాటినే విక్రయించాలి. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా ఐఎస్ఐ గుర్తింపు లేని హెల్మెట్లను వాడుతూ వాహనదారులు పట్టుబడితే వారిపై భారీ ఎత్తున జరిమానా వేస్తారట. రూ.2 లక్షల వరకు ఈ జరిమానా ఉంటుందట. ఇక ఇప్పటికే ఐఎస్ఐ గుర్తింపు లేని హెల్మెట్లను అమ్మే విక్రయదారులు రెండు నెలల్లోగా స్టాక్‌ను క్లియర్ చేసి, తరువాత ఐఎస్ఐ గుర్తింపు ఉన్న హెల్మెట్లనే విక్రయించాలని కేంద్రం ఆదేశించింది. అలాగే ప్రస్తుతం హెల్మెట్ల బరువు 1.5 కిలోల వరకు ఉంటున్నందున దాని ప్రభావం వల్ల వాహనదారులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, అందుకని హెల్మెట్ బరువును 1.2 కిలోల వరకు తగ్గించాలని కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ కొత్త నిబంధనలను అతి త్వరలోనే అమలు చేయనున్నారు. కనుక మీరు కూడా ఐఎస్ఐ గుర్తింపు ఉన్న హెల్మెట్‌లను వాడండి. లేదంటే భారీ ఎత్తున జరిమానా కట్టాల్సి వస్తుంది జాగ్రత్త..!