కార్న్ ఫ్లేక్స్ ఆరోగ్యానికి మంచివేనా..?

-

నేడు మనం గడుపుతున్నది ఉరుకుల పరుగుల బిజీ జీవితం. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే వరకు ప్రతి పనిని మనం వేగంగానే పూర్తి చేస్తాం. త్వర త్వరగా పనులు పూర్తి కావాలని కోరుకుంటాం. ఇక ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్ కూడా అంతే. చాలా త్వరగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకుంటే.. వేగంగా తిని.. వెంటనే పనిలోకి దిగవచ్చు కదా.. అని చాలా మంది భావిస్తారు. అలాంటి వారు వేగంగా ప్రిపేర్ అయ్యే బ్రేక్‌ఫాస్ట్‌లనే రోజూ తింటుంటారు. అలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లలో కార్న్ ఫ్లేక్స్ కూడా ఒకటి.

కార్న్‌ఫ్లేక్స్ కొన్ని తీసుకుని వాటిల్లో కొన్ని పాలు పోసి ఉదయాన్నే లాగించడం చాలా మందికి అలవాటు. ఇక కొందరు ఈ మిశ్రమంలో పాలతోపాటు తేనె, చక్కెర లాంటి పదార్థాలను రుచి కోసం కలుపుకుంటారు. అయితే నిజానికి కార్న్ ఫ్లేక్స్ మన ఆరోగ్యానికి మంచివేనా..? అంటే కాదు.. అనే సమాధానం వస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. కార్న్ ఫ్లేక్స్ మన ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచివి కాదు. అది ఎందుకో తెలుసుకోండి.

కార్న్ ఫ్లేక్స్‌లో కార్న్ (మొక్కజొన్న), షుగర్, మాల్ట్ ఫ్లేవరింగ్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ తదితర పదార్థాలుంటాయి. నిజానికి ఇవన్నీ హై ైగ్లెసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. అంటే.. ఇవి మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరుగుతాయన్నమాట. దీంతో ఇన్సులిన్ పెద్ద ఎత్తున విడుదలవుతుంది. అందువల్ల మెదడు కొంత సేపు ఇనాక్టివ్ అయిపోతుంది. చురుగ్గా ఉండలేరు. దీనికి తోడు కార్న్ ఫ్లేక్స్‌ను తినడం డయాబెటిస్ పేషెంట్లకు ఎంత మాత్రం మంచిది కాదు. రక్తంలో షుగర్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి. ఫ్యాట్, చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. కార్న్ ఫ్లేక్స్ తయారీలో వాడే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ మన శరీరానికి మంచిది కాదు. అందులో సాధారణ పిండిపదార్థాలు ఉంటాయి. కెమికల్ స్వీట్ ఫ్లేవర్డ్ ఎసెన్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని కలిగిస్తాయి. అధిక బరువు సమస్యను తెచ్చి పెడతాయి. దీనికి తోడు దంత క్షయం, డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక కార్న్‌ఫ్లేక్స్‌ను తినకపోవడమే మంచిది. ఈ విషయాన్ని సాక్షాత్తూ వైద్య నిపుణులే చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news