కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అనేక మంది అవసరం ఉన్నా, లేకపోయినా పల్స్ ఆక్సీమీటర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఇండ్లలో పెట్టుకుని ఉపయోగిస్తున్నారు. కోవిడ్ వచ్చిన వారి రక్తంలో ఆక్సిజన్ శాతం ఎంత మేర ఉంది ? అనే వివరాలను తెలుసుకునేందుకు ఆక్సీమీటర్ ఉపయోగపడుతుంది. అయితే కోవిడ్ లేకపోయినప్పటికీ కొందరు భయానికి ఈ మీటర్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మీటర్లను కోవిడ్ వచ్చిన వారు మాత్రమే ఉపయోగించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్ వచ్చిన వారికి శ్వాస కోశ సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే కొందరిలో రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. అలాంటి వారు వెంటనే అప్రమత్తమైన హాస్పిటల్‌కు వెళ్లాలి. అందుకోసమే.. రక్తంలో ఆక్సిజన్ లెవల్స్‌ను చెక్ చేసుకునేందుకే పల్స్ ఆక్సీమీటర్ పనికొస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇంకా పలు ఇతర విషయాలను కూడా మనం తెలుసుకోవాలి. అవేమిటంటే..
1. ఆక్సీమీటర్ అంటే ఏమిటి ?
రక్తంలో ఉన్న ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకునేందుకు ఉపయోగించే పరికరాన్ని ఆక్సీమీటర్ అంటారు. వీటినే ఎస్‌పీవో2 స్థాయిలు అని కూడా వ్యవహరిస్తారు.
2. పల్స్ ఆక్సీమీటర్లు కచ్చితత్వంతో పనిచేస్తాయా ?
సాధారణంగా ఏ ఆక్సీమీటర్ అయినా సరే 2 శాతం ఎర్రర్ విండోతో పనిచేస్తుంది. అంటే 98 శాతం వరకు అవి కచ్చితమైన రీడింగ్‌నే చూపిస్తాయి. కనుక ఆక్సీమీటర్ ఉపయోగించి ఎస్‌పీవో2 స్థాయిలను పరిశీలించదలిస్తే కనీసం 2 సార్లు అయినా టెస్ట్ చేయాలి.
3. ఆక్సీమీటర్లను ఇతర ఏ అంశాలు అయినా ప్రభావితం చేస్తాయా ?
అవును, చేస్తాయి. ఆక్సీమీటర్‌ను వేలికి పెడతారు. కనుక గోర్లకు డార్క్ నెయిల్ పెయింట్స్ వేయరాదు. అలాగే చల్లని వాతావరణం ఉన్న చోట ఆక్సీమీటర్ సరిగ్గా పనిచేయదు.
4. ఇంట్లో ఆక్సీమీటర్ వాడవచ్చా ?
ఆక్సీమీటర్ ను వాడడం చాలా సులభం. ఆక్సీమీటర్ డివైస్‌ను వేలికి తొడిగి కొన్ని సెకండ్ల పాటు ఉంచితే రీడింగ్ వస్తుంది. అందువల్ల ఇండ్లలోనూ ఈ మీటర్లను వాడవచ్చు. అందుకు ప్రత్యేక పరిజ్ఞానం ఏమీ అవసరం లేదు.
5. ఆక్సీమీటర్ ను తరచూ ఉపయోగించాలా ?
కోవిడ్ సమస్య లేని వారు ఆక్సీమీటర్‌ను వాడాల్సిన పనిలేదు. కానీ శ్వాస ఆడడం ఇబ్బందిగా ఉంటే కోవిడ్ లక్షణం అయి ఉండవచ్చు కనుక.. అలాంటి వారు ఆక్సీమీటర్ వాడవచ్చు. ఇక కరోనా పేషెంట్లు ఇండ్లలో ఉండి చికిత్స తీసుకుంటే కచ్చితంగా ఈ మీటర్‌ను ఉపయోగించాలి. దీంతో బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ ను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. సాధారణంగా ఉంటే ఓకే. తగ్గుతుంటే మాత్రం అలర్ట్ అయి వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకోవాలి.
ఇక ఆక్సీమీటర్ రీడింగ్ 95 నుంచి 100 మధ్య వస్తుంది. అలా ఉంటే నార్మల్ అని అర్థం. అదే తగ్గితే అలర్ట్ అవ్వాలి. ఇక రీడింగ్ సాధారణ స్థాయిల కన్నా ఎక్కువగా ఉండే అవకాశమే లేదు. కనుక కేవలం రీడింగ్ తగ్గితేనే జాగ్రత్త వహించాలి.