హైదరాబాద్ మహా నగరం లో భారీ వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మరోసారి హైదరాబాద్ లోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ లకు భారీగా వరదనీరు చేరుతోంది. ఇప్పటికే రెండు జలాశయాలు నిండుకుండల్లా ఉండటంతో ప్రాజెక్టులో చేరుతున్న నీటిని బయటకు వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్(గండిపేట) రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండటంతో ఇవాళ శనివారం(09.10.2021) ఉదయం 8 గంటలకు 4 గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి 960 క్యూసెక్కులు నీటిని మూసిలోకి వదలడం ప్రారంభించారు.
మధ్యాహ్నానికి ఇన్‌ఫ్లో ఇంకా పెరగడంతో 2 గంటలకు అప్పటికే తెరిచి ఉన్న నాలుగు గేట్లను 2 ఫీట్ల నుంచి 3 ఫీట్ల ఎత్తుకు తెరిచి 1400 క్యూసెక్కుల నీటిని వదిలారు. సాయంత్రం 6 గంటలకు తెరిచి ఉన్న 4 గేట్లను 3 ఫీట్ల నుంచి 5 ఫీట్లకు ఎత్తి మొత్తం 2250 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌కు 1600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. అలాగే హిమాయత్‌సాగర్ జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. ఇప్పటికే రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యంతో నీరు ఉండటంతో నీటిని బయటకు వదులుతున్నారు.
ఇప్పటికే హిమాయత్‌సాగర్ 2 గేట్లు తెరిచి ఉండగా ఇవాళ శనివారం(09.10.2021) ఉదయం 8 గంటలకు మరో 2 గేట్లను తెరిచి, మొత్తం 4 గేట్లను 1 ఫీట్ ఎత్తి 1400 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇన్‌ఫ్లో మరింత పెరగడంతో ఉదయం 11 గంటలకు 1 ఫీట్ తెరిచి ఉన్న 4 గేట్లను 2 ఫీట్లకు పెంచి 2800 క్యూసెక్కుల నీటిని వదిలారు. మధ్యాహ్నం 1 గంటకు మరో 2 గేట్లను 2 ఫీట్ల ఎత్తుకు తెరిచి, మొత్తం 6 గేట్ల ద్వారా 4200 క్యూసెక్కుల నీటిని వదిలారు. సాయంత్రం 6 గంటలకు మరో 2 గేట్లను 2 ఫీట్లకు తెరిచారు. దీంతో మొత్తం 8 గేట్ల ద్వారా 5600 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం హిమాయత్‌సాగర్‌కు 5000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.