తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం రానుందా ? ఆ పార్టీలో పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేసి ఇతర పార్టీల్లో చేరేందుకు రెడీ అవుతున్నారా ? మరి కొందరు ఏకంగా కొత్త పార్టీయే పెట్టేందుకు రెడీ అవుతున్నారా ? అంటే అవుననే ఆన్సర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఐదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో ఓటమితో మరో ఐదేళ్లు కూడా అధికారానికి దూరంగా ఉండక తప్పని పరిస్థితి. మరి ఇలాంటి టైంలో ఆ పార్టీని వీడుతోన్న సీనియర్లు కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అవుతున్నారన్న వార్తలు కల్లోలం రేపుతున్నాయి.
పార్టీలో రేణుకా చౌదరి, వీ.హనుమంతరావు లాంటి నేతలు తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు రాహుల్‌కు చేరనివ్వడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. వి.హనుమంతరావు అయితే తాను పార్టీని వీడతానన్న సంకేతాలతో కూడిన బెదిరింపులకు కూడా రెడీ అయ్యారు. సోనియమ్మ ఫ్యామిలీకి వీర భక్తుడు అయిన వీహెచ్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు రాజ్యసభక ఎంపికయ్యారు. ఇక తాజా లోక్‌సభ ఎన్నికల్లో తాను ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని చెప్పినా తనను స్థానిక కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ పట్టించుకోలేదన్న ఆవేదనతో కూడా ఆయన ఉన్నారు.
ఇక సొంత పార్టీ నేతలతో ప్రతి రోజూ పోరాడుతూ సాధించేది ఏమీ ఉండదని…. అందుకే తానే సొంతంగా పార్టీ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాడని టాక్. రాజీవ్ గాంధీ భక్తుడైన విహెచ్ తన గాడ్ ఫాదర్ పేరుతోనే పార్టీ పెట్టె ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీహెచ్‌ను ఏ పార్టీ అయినా చేర్చుకుంటుందన్న ఆశ లేనే లేదు. ఎందుకంటే ఆయనకు ఏ పార్టీలో చేరినా ఏదో ఒక పదవి కావాలి. ఆ పదవి ఇచ్చేందుకు అటు బీజేపీ కాని…. ఇటు టీఆర్ఎస్ కాని సిద్ధంగా లేవు.
ఈ క్రమంలోనే ఇప్పుడు తానే సొంత పార్టీ పెట్టి కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపేందుకు వీహెచ్ రెడీ అవుతున్నారట. కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చేలా తనకు రాజకీయ భిక్ష పెట్టిన రాజీవ్ పేరిట పార్టీ పెట్టాలని… ఆ పార్టీ కూడా రాజీవ్ జయంతి రోజున ప్రకటించాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే రాజకీయంగా చరమాంక దశలో ఉన్న వీహెచ్ కేవలం కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడంతో పాటు పార్టీ హైకమాండ్‌ను బెదిరించేందుకే ఈ పార్టీ పెడుతున్నాన్నట్టేగానే కనిపిస్తోందే తప్పా… ఆ పార్టీతో ఆయన సాధించేది ఏం ఉండదన్నది అందరికి తెలిసిందే.