2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పటి వరకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ తెలంగాణకి వెళ్లిపోయింది. దీంతో ఏపీకి కొత్త రాజధాని అవసరమొచ్చింది. ఇక 2014 లో గెలిచిన టీడీపీ గుంటూరులో కృష్ణా నదికు ఆనుకుని ఉన్న గ్రామాల్లో 33 వేలు ఎకరాలు భూసమీకరణ చేసి అమరావతిని రాజధానిగా ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని తాత్కాలిక భవనాలు నిర్మిస్తూ..పరిపాలనని అక్కడ నుంచే చేశారు.
అయితే మొన్న ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం వైసీపీ గెలవడంతో రాజధాని విషయంలో ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. వైసీపీ ప్రభుత్వం రాజధానిని మారుస్తుందని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే గత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని చెబుతూ నిర్మాణ పనులని కూడా ఆపేశారు. అలా అని రాజధాని విషయంలో పూర్తి క్లారిటీ ఇవ్వలేదు.
ఈ క్రమంలోనే మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని విషయంలో సంచలన ప్రకటన చేశారు. కృష్ణాకి వరదలు వస్తున్న నేపథ్యంలో ఏపీ రాజధానిగా అమరావతి సేఫ్ ప్లేస్ కాదు అంటూ బొత్స వ్యాఖ్యలు చేశారు. ఇక రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని, దీనిపై త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని, ఇక్కడ ముంపు సమస్యలు ఉన్నాయని బొత్స అన్నారు. అటు అమరావతి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించిందని, అంతగా సురక్షితం కాని పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారని రేపు కేంద్రం ఆరా తీస్తుందని, ప్రజలూ ప్రశ్నిస్తారు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
వీరి ప్రకటనలు చూస్తుంటే రాజధాని మారే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. కానీ అంతకముందు సీఎం జగన్ అమరావతి రాజధానిగా ఉంటుందని ప్రకటన కూడా చేశారు. అయితే ప్రస్తుతం వరదలు ఉన్న నేపథ్యంలో జగన్ రాజధాని విషయంలో సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నట్లు కనపడుతోంది. రెండు రాజధానులు ఉండేలా జగన్ ప్లాన్ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం రాజధానిని అమరావతి నుంచి తరలించేది లేదని చెబుతూనే… మరో రాజధానిని నిర్మించాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణానది వరదల ప్రభావంతో రాజధానిలో ముంపు ప్రాంతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని రాజధాని పరిధిని కుదించే అవకాశం ఉందని సమాచారం. అలాగే మరోప్రాంతంలో రాజధానిలో ఉండే కీలక సంస్థలని నిర్మించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే రాష్ట్రం విడిపోయిన కొత్తలో కొందరు రాయలసీమలో రాజధానిని నిర్మించాలని డిమాండ్ చేస్తే… మరికొందరు విశాఖపట్నంలో నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే రాయలసీమకు హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీల విభజన ఉండాలంటూ డిమాండ్లు కూడా చేశారు. వీటిని పరిగణలోకి తీసుకుని జగన్ రాజధాని అమరావతిని కుదించి మరోకచోట కూడా రాజధాని ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చూద్దాం మరి రానున్న రోజుల్లో జగన్ రాజధాని విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.