ఒకే రోజున రెండు ఆసక్తికర సినిమాలు విడుదల కావటం వల్ల నిర్మాతలు నష్టపోతున్నట్లుగా వాదన ఎప్పుడో ఉంది. కానీ.. తాము అనుకున్న డేట్ నే సినిమాను విడుదల చేయాలన్న పట్టుదల నిర్మాతల్లో ఉండటంతో చాలా సందర్భాల్లో డేట్ క్లాష్ వచ్చేస్తోంది. తాజాగా అలాంటి డేట్ క్లాష్ ఎదుర్కొంటున్న గ్యాంగ్ లీడర్.. వాల్మీకి చిత్రాలకు సంబంధించి సంధి కుదిరింది. రెండు సినిమాలు ఒకేసారి క్లాష్ వస్తే నిర్మాతలే నష్టపోతున్నారని.. అందుకే నానీ హీరోగా నటించిన నానీస్ గ్యాంగ్ లీడర్.. వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్రాలు సెప్టెంబరు 13న విడుదలయ్యేందుకు పోటీ పడుతున్నాయి.
అయితే.. ఒకేరోజు రెండు సినిమాలు విడుదలైతే ఇబ్బందన్న ఉద్దేశంతో ఈ రెండు చిత్రాల నిర్మాతల్ని కూర్చొబెట్టింది ప్రొడ్యూసర్స్ గిల్డ్. ఇద్దరితో మాట్లాడిన తర్వాత.. ముందుగా అనుకున్న డేట్ కే నానీస్ గ్యాంగ్ లీడర్ ను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ రోజే విడుదల కావాల్సిన వాల్మీకిని మాత్రం సెప్టెంబరు 20న విడుదల చేయాలని నిర్ణయించారు.
రెండు సినిమాల నిర్మాతలు తమ గిల్డ్ లోని వారే కావటంతో.. ఇద్దరిని పిలిపించి మాట్లాడామని.. ఒకరి సినిమా రిలీజ్ ఆలస్యంగా చేయాలని చెప్పి ఒప్పించినట్లుగా గిల్డ్ పేర్కొంది. గ్యాంగ్ లీడర్ తర్వాత వాల్మీకిని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రామ్ ఆచంట.. గోపీచంద్ ఆచంటలకు నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ థ్యాంక్స్ చెప్పారు. మొత్తానికి ప్లాన్ చేసి విడుదల చేయటం ద్వారా క్లాష్ రాకుండా చూడాలన్న ప్రయత్నంలో అడుగు ముందుకు పడిందన్న మాట వినిపిస్తోంది.