కరీంనగర్ కు కేంద్రం శుభవార్త చెప్పనుంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్-2023-24 ఏడాదిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులు, డిమాండ్లు, పనులకు ప్రాధాన్యం దక్కుతుందా? లేదా అన్న ఉత్కంఠ మొదలైంది.
ఉమ్మడి జిల్లాలోని రైల్వేస్టేషన్లో సదుపాయాల కల్పన, కొత్తగా ప్లాట్ ఫారాల నిర్మాణం, కొత్త రైళ్లు, వందేభారత్ రైలు, తదితరాలపై సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ ప్రజలంతా కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన కొన్ని పనులతో ఇక్కడి ప్రజలలో రైల్వే ప్రాజెక్టులపై ఆశలు చిగురించాయి. కాజీపేట-బల్లార్షా సెక్షన్, పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ సెక్షన్ లో వందేభారత్ కోసం ట్రాకులు సిద్ధం చేశారు.
ట్రాకుల సామర్థ్యం పెంచడంతో 130 కి.మీ గరిష్ట వేగం నుంచి 90 కి.మీ కనిష్ట వేగంతో ఈ రూట్లలో రైళ్లు రాకపోకలు సాగించగలవు. ఇటీవల అమృత్ పథకం కింద కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం స్టేషన్లు ఎంపికయ్యాయి. ఈ పథకం కింద ప్రతి స్టేషన్ కు రూ. 20 కోట్ల నుంచి రూ. 40 కోట్ల వరకు నిధులు రానున్నాయి. మనోహరాబాద్-కొత్తపల్లి (కరీంనగర్) మార్గంలో సిరిసిల్ల-సిద్దిపేట పట్టణాలను కలుపుతూ సుమారు 30 కిలోమీటర్ల దూరం బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్ నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే బిడ్లు ఆహ్వానించింది. ఈ పనులకు రూ. 440 కోట్ల మేరకు అంచనా వ్యయాన్ని కూడా రూపొందించింది.