వంగవీటి రాధా…ప్రస్తుతం టీడీపీ నాయకుడు. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, దివంగత వంగవీటి రంగా కుమారుడిగానే ఆయనకు గుర్తింపు, గౌరవం. వంగవీటి రంగా అంటే ఏపీలో కొన్ని వర్గాలకు ఆరాధ్య దైవం. నిరాహార దీక్షలో ఉన్న ఆయన్ను టీడీపీ పాలనలో విజయవాడ నగర నడిబొడ్డున అత్యంత అమానుషంగా హత్య చేశారు. ఆయన హత్య తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. తెలుగుదేశం ప్రభుత్వం పతనానికి దారి తీసింది.
అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. దీనికి నిలువెత్తు నిదర్శనం వంగవీటి కుటుంబ సభ్యులు టీడీపీలో చేరడం. గత సార్వత్రిక ఎన్నికల ముందు వంగవీటి తనయుడు వంగవీటి రాధా టీడీపీ కండువా కప్పుకోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఎక్కడా పోటీ చేయలేదు. ప్రస్తుతం రాజకీయంగా అంత యాక్టీవ్‌గా కూడా రాధా లేరు. ఎప్పుడో ఓసారి చంద్రబాబునాయుడును కలిసి చర్చించటం లేకపోతే అమరావతి రైతుల దీక్షలో మాత్రమే కనిపిస్తున్నారు. అంతే తప్ప.. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు రాధా. దీంతో.. త్వరలోనే ఆయన టీడీపీని వదిలేస్తారనే ప్రచారం సాగుతోంది. గతంలో ఈ ప్రచారం కొనసాగుతుండగానే.. ఒకసారి పవన్ మరోసారి మనోహర్ తో భేటీ అయ్యారు.
లేటెస్ట్ గా మరోసారి మనోహర్ ను కలుసుకోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్.. సోమవారం నాడు మచిలీపట్నం కలెక్టరేట్ కు రాబోతున్ననారు. అక్కడ కలెక్టర్ ను కలిసి నివర్ తుపాను బాధిత రైతులను ఆదుకోవాలని కోరబోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పర్యటన ఏర్పాట్లను పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ చూస్తున్నారు. ఈ ఏర్పాట్లలో బిజీగా ఉన్న మనోహర్ ను వంగవీటి రాధా కలిశారు. దీంతో అందరి దృష్టీ వీళ్ళ భేటిపైనే పడింది.
గత ఎన్నికల సందర్భంగా టికెట్ విషయమై వైసీపీతో రాధాకు విభేదాలు వచ్చాయి.
దీంతో ఆవేశానికి లోనైన రాధా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. వ్రతం చెడినా రాధాకు మాత్రం ఫలితం దక్కలేదు. మరోవైపు వంగవీటి కుటుంబం అంటే టీడీపీ ఎప్పటికీ శత్రువుగానే చూస్తుందని కాపుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి బయటపడడంతో పాటు జనసేనలో చేరే విషయమై రాధా ఊగిసలాడుతున్నారని ఆయన అభిమానులు చెబుతున్నారు.