భగవద్గీత వంటి సనాతన ధర్మ గ్రంథాల నుంచి పురాణాల వరకు అన్నింటా చెప్పేది అత్యుత్తమ భగవద్ సాధన ప్రక్రియ… జపం. జపతపాలతో భగవంతుడిని ఆరాధించడం వల్ల మానవుడు ఆయన మనసును తొందరగా గెలుచుకోవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. అన్ని యజ్ఞాలకన్నా ’జపయజ్ఞం’ గొప్పదని మనుస్మృతి చెబుతోంది. జపంలోని ‘జ – జన్మ విఛ్చేదనం చేసేది. ‘ప’ అంటె పాపాన్ని నశింపచేసేది. యోగానికి జపం ఒక ముఖ్యాంశం. భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మడు.. అర్జునిడితో, ‘యజ్ఞానాం జప యజ్ఞోస్మీ’ అని చెబుతాడు. అంటే.. యజ్ఞాలన్నింటిలో తాను జపయజ్ఞాన్ని.. అని చెబుతాడు. జపం చేస్తున్నప్పుడు భగవన్నామాన్ని లేక కొన్ని మంత్రాలనుగానీ పఠించడం జరుగుతుంది.
జపమాలలను ఉపయోగించే పద్ధతులు ఇవే!
జపమాలను మన చేతివేళ్ల ద్వారా ఉపయోగించే పద్ధతిలో ప్రధానంగా ఉన్నవి మూడు రకాలు అవి ఏంటో తెలుసుకుందాం….
కరమాల
అనామిక మధ్య కణుపు నుంచి ప్రారంభించి కనిష్టాదిగా తర్జనీమూలం వరకు గల 10 కణుపులలో ప్రదిక్షిణంగా జపించితే కరమాలతో జపించినట్లవుతుంది.
అక్షమాల
‘ఆ నుంచి ‘క్షా వరకు గల 54 అక్షరాలతో జపించడమే అక్షమాల. ‘ఆ అనంతఫలితాన్ని కలిగిస్తుండగా ’క్షా కల్మషాలను తొలగిస్తుంది.
మణిమాలలు
రుద్రాక్షలు, ముత్యాలు, స్పటికాలు, శంఖాలు, పగడాలు, సువర్ణమాలలు, రజితమాలలు తులసిపూసలు, కుశదర్భమాలలు, పద్మబీజాలు, పుత్రజీవాలు ఉపయోగించి చేయబడిన మాలలను మణిమాలలని అంటారు.
ఏ జపమాలతో చేస్తే ఏం ఫలమంటే!!
రుద్రాక్షమాల జపం అనంతఫలితం. తులసిమాల జపం అనంతకోటి గుణాన్ని, పగడాల మాలలతో జపం చేయడం వలన ఐశ్వర్య వృద్ధి, స్ఫటికమాల జపం దశసహస్రగుణాన్ని, రేఖాజపం దశగుణాన్ని, శంఖమాలజపం శతగుణాన్ని, పగడాలమాల జపం సహస్రగుణాన్ని, ముత్యపు మాల జపం లక్ష గుణాన్ని, తామరపూసల మాలాజపం దశ లక్షగుణాన్ని, బంగారుమాల జపం కోటి గుణాన్ని, ముత్యపు మాలతో జపం చేస్తే సర్వమంగళం, తులసి మాలతో చేస్తే సమస్తమైన ఫలాలు, రుద్రాక్షమాలతో జపం చేస్తే ఆత్మజ్ఞానం కలిగి మోక్షం కలుగుతుంది.
– కేశవ