‘దొంగ’గా రంగంలోకి దిగుతోన్న ఖైదీ..

త‌మిళ హీరో కార్తి ఆన‌తి కాలంలోనే మంచి స్టార్ స్టేట‌స్ పొందారు. ప్ర‌స్తుతం కార్తీ సినిమాలంటే ప‌క్కా హిట్ అనే అభిప్రాయం ప్రేక్ష‌కుల‌లో ఉంది. కార్తీ నుంచి ఇటీవల వచ్చిన ‘ఖైదీ’ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది. యాక్షన్ .. ఎమోషన్ తో మొదటి నుంచి చివరివరకూ ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమా మొత్తం ఒకే ఒక డ్రెస్ లో కనిపించిన కార్తీకి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి. అలాంటి కార్తీ ఈ ఏడాదిలోనే మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు .. ఆ సినిమా పేరే ‘దొంగ’.

డిఫరెంట్ లుక్ తో కార్తీ కనిపించే ఈ సినిమాలో ‘జ్యోతిక’ ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. మలయాళంలో ‘దృశ్యం’ సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకి దర్శకుడు కావడంతో, అందరిలోనూ ఆసక్తి వుంది. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో కార్తీకి మరో హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.