దేవాలయాలపై జరుగుతున్నదాడుల విచారణకు సంబంధించి ప్రభుత్వం నియమించిన సిట్ ఏర్పాటు అనేది వేస్ట్ వ్యవహారం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్థాయిలో ఉన్న సీఐడీని కాదని ప్రభుత్వం డీఐజీ స్థాయి అధికారితో సిట్ నియమించడం హిందువులను మభ్యపెట్టడంలో భాగంగా జరిగిందేనని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని హైందవభక్తుల మనోభావాలతో ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆటలాడుతున్నారని అర్థమవుతోందన్న ఆయన రాష్ట్రంలో హిందూదేవాలయాలపై వరుసగా జరుగతున్నదాడుల సూత్రధారులు బయటకు రావాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గం అని అన్నారు. సిట్ లు, సీఐడీలతో అసలు దొంగలు దొరకరని ప్రభుత్వానికి కూడా తెలుసన్న ఆయన అతి సున్నితమైన మతసామరస్యం విషయంలో ప్రభుత్వం పిల్లాటలు ఆడటం మంచిది కాదని అన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ పై, అమరావతి భూముల వ్యవహారం పై వేసిన సిట్ కమిటీలు ఏం సాధించాయి? అని ఆయన ప్రశ్నించారు.