కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరు నగరం వరదల్లో కొట్టుమిట్టాడుతోంది. కాలు తీసి బయట పెట్టాలంటే వరదలో ఎక్కడ కొట్టుకుపోతామోనని ప్రజలు భయంతో బతుకుతున్నారు. మరోవైపు ఏకధాటి వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి.
కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాల గుండా ప్రవహించే వేదవతి నది జలకళ సంతరించుకుంది. ఈ నది వందేళ్ల తర్వాత పొంగి పొర్లుతోందని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. కర్ణాటక పరిధిలో ఈ నదిపై నిర్మించిన ప్రాజెక్టుల కారణంగా ఈ నదిలో కొన్ని దశాబ్దాలుగా ప్రవాహం లేదని.. జలకళ లేక నది ఆనవాళ్లు కూడా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇసుక మేటలు వేసి ఎడారిని తలపించే ఈ నదికి 1982, 1996లలో కొద్దిగా ప్రవాహం వచ్చిందని వెల్లడించారు.
దాదాపు వందేళ్ల తర్వాత వేదవతి నది వారం రోజులుగా ఎగువన కురిసిన వర్షాలకు ఉగ్రరూపం దాల్చింది. శతాబ్దకాలంలో ఎన్నడూ లేనంత ప్రవాహం కొనసాగుతోంది. దీనిపై నిర్మించిన భైరవానితిప్ప ప్రాజెక్టు నుంచి అన్ని గేట్లు ఎత్తి.. 63వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడం ఇదే తొలిసారి. 1970 దశకంలో రెండు గేట్లు ఎత్తినట్లు అధికారులు చెబుతున్నారు. పరీవాహక ప్రాంతాల్లో సాగు చేసిన పంటలు మొత్తం కొట్టుకుపోయాయి. ఇంతటి ప్రవాహాన్ని ఎప్పుడు చూడని స్థానికులు నదిని అబ్బురంగా తిలకిస్తున్నారు.