మీరు శాకాహారులా ? అయితే ఇప్పుడు చెప్పబోయేది మీకు నిజంగా చేదు వార్తే. ఎందుకంటే మాంసాహారం తినే వారి కన్నా శాకాహారం తినే వారి ఎముకలే ఎక్కువగా విరుగుతుంటాయని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. సుమారుగా 55వేల మందిపై చేసిన అధ్యయనాల మేరకు సైంటిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు.
నఫిల్డ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పాపులేషన్ హెల్త్ సైంటిస్టులు 18 ఏళ్ల పాటు సుదీర్ఘ అధ్యయనం చేపట్టారు. మొత్తం 55వేల మందిపై 18 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. వారిలో 2వేల మంది శాకాహారులు. కాగా మాంసాహారం తినే వారి కన్నా శాకాహారం తినేవారికే ఎముకలు విరిగే అవకాశాలు 43 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు.
ప్రతి 1000 మందిలో కనీసం 20 మంది శాకాహారుల్లో ఎముకలు త్వరగా విరిగే సమస్య వచ్చినట్లు గుర్తించామని సైంటిస్టులు తెలిపారు. అయితే నిజానికి శాకాహారం, మాంసాహారం ఏది తిన్నా పోషకాలు అన్నీ లభించేలా చూసుకుంటే ఏ సమస్య రాదని వారు తెలిపారు. కనుక ఎవరైనా సరే.. ఏ రకమైన ఆహారం తిన్నా పోషకాలు అన్నీ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఈ అధ్యయనానికి చెందిన వివరాలను బీఎంసీ మెడిసిన్‌లో ప్రచురించారు.