ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల సినీ లోకం దిగ్ర్భాంతి చెందుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు విశ్వనాథ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన కళాతపస్వి మరణించారని తెలిసి తాను ఎంతో దిగ్ర్భాంతి చెందానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
“‘సుప్రసిద్ధ దర్శకులు శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. కళాతపస్విగా పేరు గాంచిన ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచి, మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. సౌండ్ రికార్డిస్ట్ గా సినీ ప్రస్థానం ప్రారంభించిన శ్రీ విశ్వనాథ్ గారు, దర్శకుడిగా తొలి అడుగునే నంది అవార్డుతో ప్రారంభించారు. భాష, సంస్కృతి, కళలకు పెద్ద పీట వేస్తూ, అగ్రకథానాయకుల్ని సైతం ఆదర్శనీయ పాత్రల్లో చూపిన వారి చిత్రాలు ఆనందాన్ని, సందేశాన్ని అందించి ఆదర్శంగా నిలిచాయి.’’” అని వెంకయ్య అన్నారు.