జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు తెలిపారు. చిలకలూరిపేటలోని తన సొంత కార్యాలయంలో మంత్రి విడదల రజిని గారు శుక్రవారం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కొనసాగతుందని చెప్పారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 20 వ తేదీ వరకు మొత్తం 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు విస్తృతంగా ప్రజల్లోకి వెళతారని చెప్పారు.
రాష్ట్రంలోని మొత్తం 1.65 కోట్ల కుటుంబాలను వీళ్లు పలకరిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు వెళ్లి ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి స్పందన తీసుకుంటారని వెల్లడించారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం ఈ దేశానికే భవిష్యత్తులో దిక్సూచిగా మారబోతోందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో దాదాపు 80 శాతం మంది ప్రజలకు వారి ఆరోగ్య అవసరాలు వారి సొంత ఊళ్లోనే తీరిపోతాయని వెల్లడించారు. ఐదు అంశాలకు సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని నమోదు చేసుకుంటారని చెప్పారు. గత ప్రభుత్వ అరాచకాలను, అప్పట్లో ప్రజలు పడిన ఇబ్బందులను ప్రజలు ఎలా మోసపోయారో కూడా వివరిస్తారని వెల్లడించారు. ఇంట్లోని కుటుంబ సభ్యులందరితో గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు మాట్లాడి వారి అనుమతితో ఆ కుటుంబ సభ్యుల ఫోన్ నుంచి 8296082960 అనే నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తారని పేర్కొన్నారు. మిస్డ్ కాల్ వెళ్లిన రెండు నిమిషాల్లో వారికి బదులుగా కాల్ వస్తుందని, ఆ కాల్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మెసేజిని అందుకుంటారని వెల్లడించారు.