నటుడు-రాజకీయ నాయకుడు విజయకాంత్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ని చెన్నై రామపురంలోని MIOTఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం అందుతోంది. దేశియ ముర్పోక్కు ద్రవిడ కజగం వ్యవస్థాపకుడయిన ఈయన అనేక సంవత్సరాలుగా అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన అభిమానులకు, అనుచరులకు ఈ వార్త షాక్ అనే చెప్పాలి. ఈయన్ని అభిమానులు ముద్దుగా కెప్టెన్ అని పిలుచుకుంటారు. చివరిసారిగా ఆయన తన కుమారుడు షణ్ముగ పాండియన్ చిత్రం సాగప్తం (2015) లో అతిధి పాత్రలో కనిపించాడు.
విరుధగిరి (2010) ఆయన హీరోగా నటించిన చివరి సినిమా. ఈ సినిమాని ఆయన తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇక కరోనా వైరస్ బారిన పడిన వారి మృతదేహాలను పాతిపెట్టడానికి ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కోవిడ్ -19 బాధితుల మృతదేహాలను పాతిపెట్టడానికి తన భూమిని దానం చేయడానికి కొన్ని రోజుల క్రితం ఈయన ముందుకు వచ్చారు. చెన్నైకి సమీపంలో ఉన్న శ్రీ ఆండల్ అలగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సమీపంలో అందుకోసం తాను కొంత భూమిని కేటాయిస్తున్నట్లు విజయ కాంత్ కొద్ది రోజుల క్రితం ఒక ప్రకటనలో తెలిపారు. కొరోనావైరస్ శవాల ద్వారా వ్యాపించదని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు, అదే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని తన పార్టీ కార్యకర్తలను కూడా కోరారు.