ఇవాళ రాత్రి భారత్‌కు మాల్యా….లండన్ నుంచి నేరుగా జైలుకే..!

కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ కంపెనీ కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా పలు బ్యాంకులకు రూ.9వేల కోట్లకుపై రుణాలను ఎగవేసి 2016 మార్చిలో భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయిన భారతీయ వ్యాపారవేత్త విజయ్ ​మాల్యాను భారత్​కు తీసుకొచ్చే అంశమై న్యాయపరమైన ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆదేశాలపై బ్రిటన్ హోంమంత్రి కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు రాత్రి లండన్ నుంచి విజయ్ మాల్యను ముంబాయి తీసుకువస్తున్నట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ IANS వెల్లడించింది. అలాగే ముంబై ఎయిర్‌పోర్టు నుంచి మాల్యాను నేరుగా ఆర్ధర్ రోడ్డులోని సెంట్రల్‌కు తరలిస్తారని సమాచారం. అక్కడ సీబీఐ అధికారులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. అనంతరం గురువారం మాల్యాను కోర్టులో ప్రవేశపెడతారని తెలుస్తోంది. మాల్యాను కస్టడీకి అప్పగించాలని సీఐడీ, ఈడీ కోర్టును కోరే అవకాశముంది. ఐతే మాల్యా అప్పగింతకు సంబంధించి కేంద్రం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

ఐతే మాల్యాను భారతదేశానికి అప్పగించాలంటూ వెస్ట్‌ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆదేశాలను బ్రిటన్ హోంమంత్రి ఆమోదించిన విషయం తెలిసిందే. మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ మాల్యా హైకోర్టును ఆశ్రయించగా.. ఆయన అప్పీలును కొట్టివేస్తూ ఏప్రిల్ 20న హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపైనా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా.. అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. మే 14న విజయ్ మాల్యా వేసిన పిటిషన్‌ను యూకే సుప్రీంకోర్టు తిరస్కరించింది. దాంతో బ్రిటన్‌లో మాల్యాకు అన్ని దారులూ మూసుకుపోయాయి. బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ సంతకం చేసిన వెంటనే ఆయన్ను భారత్‌కు అప్పగిస్తారు. ఇప్పటికే ఆ ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.