మిస్టరీ : కుప్పం ఏఎస్సై ఆత్మహత్య…!

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుప్పం పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై రాజేంద్రప్రసాద్ (57) బుధవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుప్పం అర్బన్‌ సీఐ ఈదూర్ బాషా తెలిపిన వివరాల ప్రకారం..

చిత్తూరుకు చెందిన రాజేంద్రప్రసాద్ 2019 సెప్టెంబర్ లో పెనుమూరు నుండి కుప్పంకు ఏఎస్సైగా బదిలీపై వచ్చారు. పది రోజుల క్రితం చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ మీద వెళ్లాల్సి ఉండగా.. లాక్ డౌన్ కారణంగా రిలీవ్ అవ్వలేదు. అయితే కుప్పం మండలం నడుమూరు చెక్ పోస్ట్ వద్ద విధులకు రాజేంద్ర హాజరు కావాల్సి ఉంది. బుధవారం విధులకు రాకపోవడంతో పోలీసు సిబ్బంది ఫోన్ ద్వారా సంప్రందించినా.. ఎలాంటి స్పందన రాలేదు. కుటుంబ సభ్యులు సైతం ఉదయం 7 గంటల నుంచి ఫోన్ ద్వారా ప్రయత్నించినా ఏఎస్సై రాజేంద్ర ప్రసాద్ నుంచి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు కుప్పంలోని పాతపేట గాండ్లవీధిలో ఆయన అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లారు. బయట నుంచి ఎంత పిలిచినా పలుకలేదు. దీంతో అనుమానం వచ్చి తలుపులు పగలకొట్టి చూడగా రాజేంద్రప్రసాద్‌ ఇంట్లో ఉన్న దూలానికి వేలాడుతూ కనిపించాడు. కాగా, కుటుంబ కలహాలతోనా  లేక మరే  ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారన్నది తెలియాల్సి  ఉండగా.. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.